మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్, ఛత్తీస్‌గఢ్: ఇటీవల మావోల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో.. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై రూ.67 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణ సాయం కింద రూ.50 వేలు చొప్పున నగదు సాయం అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
దేశంలో మావోయిస్ట్‌లు లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం.. ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మావోల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఇటీవల అనేక మంది మావోల కీలక నేతలతో పాటూ అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు ఈ ఏడాది మేలో మావోల పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ అలియాస్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన విషయం తెలిసిందే.
కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత అనేక మంది కీలక నేతలు హతమయ్యారు. ఇలా వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీల్లో చీలికలు మొదలయ్యాయి. ఇటీవల పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన తదితరులు తమ అనుచరులతో కలిసి లొంగిపోయారు. ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కీలక నేత మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజే, టెక్ శంకర్ తదితరులు చనిపోయారు. వీరి ఎన్‌కౌంటర్ తర్వాత మవోల లొంగుబాట్లు మరింత పెరిగాయని చెప్పొచ్చు.
