INDIA, WORLD NEWS: విదేశాల్లో మృతి చెందిన మరో భారతీయ యువకుడి కథ తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... యూకేలో వోర్ స్టర్ లో నవంబర్ 25న హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు! దీంతో.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
యూకేలో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... భారతీయ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన ఈ నెల 25న జరగ్గా.. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందాడు. ఈ క్రమంలో ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విజయ్ కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో ఉన్నత చదువుల కోసం యూకేకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతకు ముందు అతడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ లో ఉద్యోగం చేసేవాడని.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, జనవరిలో బ్రిటన్ కు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది.
ఈ సందర్భంగా స్పందించిన చర్కి దాద్రి ఎమ్మెల్యే సునీత సత్పాల్ సంగ్వాన్.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా.. న్యాయం జరిగేలా, నేరస్థులు ఖచ్చితంగా జవాబుదారిగా ఉండేలా.. పారదర్శకంగా, న్యాయంగా, సమయానుకూలంగా దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి ప్రభుత్వ సహాయం కోరారు.
బద్రాలో జాగ్రంబాస్ గ్రామంలో నివసిస్తున్న విజయ్ సోదరుడు రవి కుమార్ తక్షణ జోక్యం కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు! ఈ లేఖలో.. విజయ్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకునే ముందు గతంలో కొచ్చిలో పనిచేసేవాడని తెలిపారు. మద్దతు కోసం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైనీలను కూడా సంప్రదించారని తెలుస్తోంది.
వెస్ట్ మెర్సియా పోలీసుల అధికారిక ప్రకటన!:
మంగళవారం ఉదయం (నవంబర్ 25) తెల్లవారుజామున 4:15 గంటల ప్రాంతంలో వోరెస్టర్ లోని బార్బోర్న్ రోడ్ లో 30 ఏళ్ల వ్యక్తిని అధికారులు తీవ్ర గాయాలతో కనుగొన్నారని పోలీసులు తెలిపారు. అనంతరం అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఈ కేసులో ఐదుగురు అనుమానస్తులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
