మీరు ఎప్పుడైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి..


ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రస్తుత సమాజంలో జరుగు తున్న వివిధ రకాల సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, చేసిన ముఖ్య మైన హెచ్చరికలు.


ANDRAPRADESH, ELURU, CRIME NEWS: ఏలూరు జిల్లా ఎస్పీ కీలక సూచనలు
నేటి డిజిటల్ యుగంలో అమాయక ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.

నకిలీ చలానా APK ఫైల్స్  వాట్సాప్ మోసాలు
వాట్సాప్ ద్వారా "పరివాహన్ ఆర్టీవో చలానా" పేరుతో నకిలీ APK ఫైల్స్ పంపిస్తున్నారు. ఈ ఫైల్స్ ఇన్‌స్టాల్ చేస్తే మీ ఫోన్ కంట్రోల్ వారి చేతికి వెళ్తుంది. మీ SMSలను చదవడం ద్వారా బ్యాంక్ OTPలను సేకరించి, మీ ఖాతాలోని డబ్బును దోచుకుంటారు అని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్ ద్వారా వచ్చే అనాథరైజ్డ్ APK లింకులను ఓపెన్ చేయవద్దు. చలానాలు కట్టాలనుకుంటే కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు లేదా PhonePe వంటి నమ్మకమైన యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.

లోన్ యాప్‌ల వేధింపులు  విద్యార్థులూ జాగ్రత్త
ఇన్స్టంట్ లోన్ అంటూ విద్యార్థులను, యువతను ఆకర్షించి, ఫోన్ కాంటాక్ట్స్ మరియు డేటాను సేకరిస్తారు. అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా, ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇది ఆత్మహత్యల వరకు దారితీస్తోంది. ఆన్లైన్ లోన్ యాప్‌లను నమ్మకండి. డబ్బు అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకులను ఆశ్రయించండి.

క్రిప్టో కరెన్సీ & బిట్ కాయిన్ మోసాలు
అధిక లాభాల ఆశ చూపి ఎగ్జిస్టెన్స్ లేని నకిలీ కాయిన్స్‌ను ఆన్లైన్‌లో చూపిస్తూ ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్నారు.  మీ ఆధార్, ఈమెయిల్ వివరాలు వాడి మీ పేరుతో ఖాతాలు తెరిచి అక్రమ లావాదేవీలు చేస్తారు. తెలియని క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్స్ ఉపయోగించడం వల్ల మీరు నేరస్థులుగా మారి జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. అవగాహన లేకుండా ఇలాంటి ట్రేడింగ్‌ కు ప్రజలు  దూరంగా ఉండాలి.

ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్
మొదట్లో ₹1000, ₹2000 లాభం ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత లక్షల్లో లాభం చూపిస్తూ. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే GST, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మీ వద్ద నుండి లక్షల రూపాయలు దోచుకుంటారు. గుర్తుంచుకోండి అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటే అది కచ్చితంగా మోసమే అని గ్రహించండి.

సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 
మీరు ఎప్పుడైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి. మీ వ్యక్తిగత వివరాలు, OTPలు, బ్యాంక్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు. అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండి మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి అని హెచ్చరించిన ఏలూరు జిల్లా ఎస్పీ.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now