ఏపీని టెన్షన్ పెడుతున్న దిత్వా తుఫాన్


INDIA, THUPAN NEWS: శ్రీలంకను దాటి చెన్నైని మించి ఏపీ వైపుగా దిత్వా తుఫాన్ దూసుకుని వస్తోంది. దీని ప్రభావంతో దక్షిణాంధ్ర అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అవుతాయని చెబుతోంది. దిత్వా తుపాను కారణంగా సోమవారం నుంచి రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అయితే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అదే మాదిరిగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.


ఇదీ పరిస్థితి :
ఇదిలా ఉంటే దిత్వా తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో దాదాపు ఉత్తరం వైపుకు కదులుతోంది ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల నుండి తుఫాను కేంద్రం దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తుపాను కదులుతూ తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తీరాన్ని తాకకుండానే :
అయితే దిత్వా తుఫాన్ తీరాన్ని తాకకుండానే నైరుతి బంగాళాఖాతంలోనే బలహీనపడవచ్చు అని అంటున్నారు దాంతో తీరం తాకితే ఏర్పడే విధ్వంసం ముప్పు అయితే లేనట్లే. కానీ ఇది బలంగా ముందుకు సాగుతూ తన ప్రభావాన్ని చూపిస్తున్నంత సేపూ మాత్రం తమిళనాడు ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు అలాగే రాయలసీమ జిల్లాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు.

అలెర్ట్ గా ఉండాల్సిందే :
దిత్వా తుపాను తీవ్రత నేపధ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ నుండి సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలన్నారు. ఎవరికీ ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా చూడటం న అందరి బాధ్యత అని హోంమంత్రి స్పష్టం చేశారు.

పునరావాసానికి..
అదే విధంగా కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతి కాల్‌కు వెంటనే స్పందించాలని ఆమె సూచించారు. ప్రమాద ప్రదేశాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో అధికారులని నియమించాలని ఆదేశించారు. రోడ్లపై పడిన చెట్టు కొమ్మలు, హోర్డింగ్స్ వంటి అడ్డంకులను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంటే వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టు హోంమంత్రికి నివేదించారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేయాలని ఆమె కోరారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now