- వినూత్న నమూనాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
- హోమ్‌స్టేలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
- క్యాలెండర్ ప్రకారం పర్యాటక కార్యక్రమాలు
- జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 24: గౌరవ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధికి కూడా సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని, టూరిజంలో వినూత్న నమూనాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పర్యాటక కౌన్సిల్ (డీటీసీ) సమావేశం జరిగింది. పర్యాటక శాఖ అధికారులతో పాటు ట్రావెల్స్, బోటింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్, హోమ్‌స్టేలు, పర్యాటక ఈవెంట్లు, ట్యాక్సీ యాప్ తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయాల సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి సహాయసహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు.
పర్యాటక రంగ సుస్థిర అభివృద్ధికి, స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఫలాలు అందించడంలో హోమ్‌స్టేలు కీలకపాత్ర పోషిస్తాయని.. వీటిపై ఔత్సాహికులకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పర్యాటక సేవలు, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉన్న ట్యాక్సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి ఆటో, ట్యాక్సీలోనూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీలకు సంబంధించిన బ్రోచర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డిజిటల్ కంటెంట్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని.. హౌస్ బోట్, హెలీ టూరిజం తదితరాలపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. డిమాండ్ దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ హౌస్ బోట్‌లు ఏర్పాటుచేసేలా ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. జనవరి 8 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవాన్ని విజయవంతం చేసేందుకు టూరిజం అధికారులు సమష్టిగా కృషిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో పర్యాటక శాఖ ఆర్‌డీ వైవీ ప్రసన్నలక్ష్మి, ఎన్‌టీఆర్ జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీటీడీసీ ఈఈ ఎం.శ్రీనివాసరావు, బీఐటీసీ ఈడీ జి.ఉమామహేశ్వరరావు, డా. తరుణ్ కాకాని (అమరావతి బోటింగ్ క్లబ్), వాటర్ ఫ్లీట్ జీఎం నాంచారి, డీఆర్‌డీఏ, మెప్మా తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
