న్యూఢిల్లీ, డిసెంబరు 1: దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులన్నింటినీ సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో ఏకరీతి దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అలాగే సీబీఐ తమ రాష్ట్రాల్లో విచారణ సాగించేందుకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సహకరించాలని సూచించింది.
సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాంక్ ఖాతాలను గుర్తించేందుకు ఏఐ, మిషన్ లెర్నింగ్ సాంకేతికతను ఎందుకు వినియోగించడం లేదని రిజర్వ్ బ్యాంక్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. డిజిటల్ అరెస్టుల మోసాలకు గురైన హరియాణా వృద్ధ దంపతుల ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఈ చర్యలు చేపట్టింది.
ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు జీవితాంతం కూడబెట్టిన దోశలను దోచేస్తున్నారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తులో సీబీఐకి కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ సహకరించాలని దేశంలోని ఐటీ సంస్థలు, టెలికం సేవాదారులను కోర్టు ఆదేశించింది. ఒక వినియోగదారుడికి ఎన్నిసిమ్‌లు జారీ చేస్తారన్న వివరాలు నివేదించాలంటూ టెలికం విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసింది.
విదేశాల్లో, ముఖ్యంగా ట్యాక్స్ మినహాయింపులు ఉన్న దేశాల్లో దాక్కున్న సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్‌తో కలిసి పనిచేయాలని సీబీఐకి సూచించింది. ఆన్‌లైన్ మోసాల అరికట్టడంపై కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించాలని సొలిసిటర్ జనరల్‌ను కోరింది. ఇదిలావుంటే, సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలను వెంటనే స్తంభింపజేసే అధికారాన్ని సీబీఐతోపాటు రాష్ట్రాలు, యూటీలకు కూడా సుప్రీంకోర్టు కల్పించింది.
