తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు.. అధిష్టానం సీరియస్ వార్నింగ్!


హైదరాబాద్ / ఢిల్లీ: 2028 ఎన్నికల లక్ష్యంగా పనిచేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తుంటే, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతల వ్యవహారం పార్టీ అధిష్టానానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. నేతలు తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ, పరస్పర విభేదాలను బహిరంగంగా బయటపెడుతుండటంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పార్టీకి రాజకీయ బేస్ బాగానే ఉన్నప్పటికీ, అంతర్గత కలహాలు మాత్రం పార్టీ భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటుశాతం పెరిగినప్పటికీ, దానిని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలోనే నేతల మధ్య కుమ్ములాటలు తీవ్రరూపం దాల్చడం పార్టీకి నష్టంగా మారుతోంది.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు వాదోపవాదాలు దాటి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించడంతో పాటు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని అధిష్టానం భావిస్తోంది.

ప్రధానంగా సోషల్ మీడియాలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న పోస్టులు పార్టీ పెద్దలను కలవరపెడుతున్నాయి. ఆధిపత్య ధోరణితో పెట్టే పోస్టుల వెనక కొందరు సీనియర్ నేతల హస్తం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లోనూ బీజేపీ బలంగా ఉందని గొప్పలు చెప్పుకునే నేతలే పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అధిష్టానానికి మింగుడు పడని అంశంగా మారింది.

ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ పరువు తీసే పోస్టులు పెట్టిన వారిని వెంటనే డిలీట్ చేయించడమే కాకుండా, అవసరమైతే ఢిల్లీకి పిలిపించి మందలిస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగత దూషణలకు పాల్పడే పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ స్పష్టమైన హెచ్చరికలు ఇస్తోంది.

పార్టీ నేతలే సొంత సోషల్ మీడియా టీములు ఏర్పాటు చేసుకుని తమకు నచ్చని నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న విషయం అధిష్టానం దృష్టికి రావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఎవరు ఈ పోస్టులు పెడుతున్నారు? ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు? అన్న అంశాలపై ఆరా తీస్తే, విద్వేష పోస్టుల వెనక పెద్ద తలకాయలే ఉన్నట్లు సమాచారం రావడంతో అధినాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, పార్టీలోనే ఉన్న నేతలపై అన్యాయంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని అధిష్టానం స్పష్టం చేస్తోంది. నాయకులు ఎంతటి వారైనా, పార్టీ శ్రేయస్సుకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, 2028 నాటికి ప్రజల్లో హిందుత్వ భావనలను బలంగా తీసుకెళ్లడం, మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యాలుగా అధిష్టానం పేర్కొంటోంది. అయితే ఈ లక్ష్యాల సాధనకు అడ్డంకిగా మారుతున్న ముఠా తగాదాలు, సోషల్ మీడియా వార్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు ఇతర నేతలపై దుష్ప్రచార పోస్టులు చేయడం పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణ గల్లీలో జరిగే పోరాటాలు ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తాయన్న హెచ్చరికలతో నాయకత్వం రంగంలోకి దిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని వారు మౌనంగా ఉండిపోయే ప్రమాదముందని అధిష్టానం భావిస్తోంది. మరి ఈ వ్యవహారం తాత్కాలిక తుపానుగానే మిగులుతుందా? లేక తెలంగాణలో బీజేపీకి గణనీయమైన నష్టం కలిగిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now