జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్‌లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్‌ఎస్‌ఎస్ సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించి పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు.
కాట్రావులపల్లిలోని ఈ పెట్రోల్ బంక్‌లో పెట్రోలు కొట్టించుకున్న పలువురు వాహనదారుల మోటార్ సైకిళ్లు ఇటీవల తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా అనేక వాహనాలు పాడవడంతో మెకానిక్‌లను సంప్రదించగా, పెట్రోల్‌లో తేడాలే కారణమని వారు స్పష్టం చేసినట్లు వాహనదారులు తెలిపారు.
దీంతో సుమారు 28 మంది వాహనదారులు సాయంత్రం పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ వాహనాల మరమ్మతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యానికి, వినియోగదారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జగ్గంపేట ఎంఎస్‌ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు బంక్‌కు చేరుకుని రికార్డులు పరిశీలించడంతో పాటు పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు.
తనిఖీల్లో సాంద్రతలో భారీ తేడాలు గుర్తించినట్లు సత్యనారాయణ రాజు మీడియాకు తెలిపారు. కల్తీ జరిగినట్లు నిర్ధారించుకుని బంక్‌ను సీజ్ చేయడంతో పాటు యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్‌పై 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్‌ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్‌ఆర్ బంక్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో జగ్గంపేట ఎంఎస్‌ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
_11zon.jpg)