తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్‌లో నటుడు శివాజీ విచారణ కొనసాగుతోంది. దండోరా సినిమా ప్రమోషన్‌లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు(misogynistic remark) చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మహిళల వస్త్రధారణపై ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకునేందుకు కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ళ శారద విచారణ జరిపారు.
1.మహిళల పై మీరు చేసిన వాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తోంది.. మీరేమంటారు?
2. ఒక నటుడిగా మీ వాఖ్యలు సమాజం పై ప్రభావం చూపుతాయి.. ఇది మీకు తెలిసే ఇలాంటి వాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తోంది..
3. మహిళల వస్త్రాధారణ ఆధారంగా వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా?
4. మీ వాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి!
5. మీ వాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి.. వీటికి మీ సమాధానం?..
పై పశ్నలకు శివాజీ ఇచ్చిన వివరణలను తెలంగాణ మహిళా కమిషన్ రికార్డు చేసింది.
దండోరా సినిమా ఈవెంట్‌లో శివాజీ చేసిన ఆ అసంబద్ధ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది.
అంతకు ముంద.. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ షరతులతో కూడిన క్షమాపణలు చెప్పారు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఈ సీనియర్ నటుడు.. తన వ్యాఖ్యలను గానూ మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలంటూ మాట్లాడారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే.. తన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో శివాజీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఫిర్యాదులు, కేసులు నమోదు కాకపోవడం మరో కొసమెరుపు.
