మస్క్ స్టార్ లింక్ కు షాక్.. అదుపు తప్పి కూలిపోతున్న ఉపగ్రహం


WORLD NEWS, SPECIAL NEWS: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన స్టార్ లింక్ ప్రాజెక్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎలన్ మస్క్ కు చెందిన ‘స్టార్ లింక్’ ఉపగ్రహాల్లో ఒకటి అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయి భూమి వైపు కూలిపోతోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఈనెల 17వ తేదీన స్టార్ లింక్ శాటిలైట్ నంబర్ 35956 భూమికి సుమారు 418 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ఉంది.


అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో దాని ప్రొపెల్షన్ ట్యాంక్ నుంచి గ్యాస్ అత్యంత శక్తివంతంగా వెలువడింది. దీని ప్రభావంతో ఉపగ్రహం ఒక్కసారిగా దాదాపు నాలుగు కిలోమీటర్లు దిగజారినట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది. అనంతరం ఉపగ్రహంలోని కొన్ని భాగాలు విడిపోయి నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి. 

ఈ ఘటనపై స్పందించిన స్పేస్ ఎక్స్.. ‘వారం రోజులలోపే ఈ ఉపగ్రహ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించి ఘర్షణ కారణంగా కాలిపోయే అవకాశం ఉంది అని తెలిపింది. ఈ నేపథ్యంలో భూమికి లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంటే తక్కువ ఎత్తులో ఉందని పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలాస్కా సమీప గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో వెంటోర్ టెక్ సంస్థకు చెందిన వరల్డ్ వ్యూ3 ఉపగ్రహం 241 కి.మీల నుంచి దూరం నుంచి హైరిజల్యూషన్ చిత్రాలను తీసింది. ఈ చిత్రాలు ప్రస్తుతం అంతరిక్ష పరిశోధకుల్లో చర్చనీయాంశంగా మారాయి. 

స్పేస్ ఎక్స్ ప్రకారం.. స్టార్ లింక్ ఉపగ్రహాలు లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ఉండటంతో భూగురుత్వాకర్షణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఉపగ్రహాలు నియంత్రణ కోల్పోతే వాతావరణ ఘర్షణతో సహజంగానే కలిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం స్టార్ లింక్ ప్రాజెక్ట్ కింద దాదాపు 9వేల ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి పంపింది. వీటి ద్వారా ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోంది. 

ఈ కార్యక్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, అలాగే యూఎస్ స్పేస్ ఫోర్స్ తో సమన్వయం చేసుకుంటూ అమలు చేస్తోంది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన స్టార్ లింక్ భద్రతా వ్యవస్థలపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయినప్పటికీ స్పేస్ ఎక్స్ పూర్తి స్థాయి పర్యవేక్షణతో పరిస్థితిని నియంత్రణలో ఉంచిందని.. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now