ANDRAPRADESH: ఎవరికి నచ్చిన పార్టీలో వారు ఉంటారు. అలాగే ఎవరికి నచ్చిన తీరున వారు రాజకీయాలు చేసుకుంటారు ఇది ప్రజాస్వామ్యం. అందరూ ఒకేలా ఉండరు కదా. ఇక రాజకీయాల్లో పార్టీలు మారడం నేరమూ కాదూ ఘోరమూ కాదు, ఆ మాటకు వస్తే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అనేక మందికీ ఇదే వస్తుంది అని అంటున్నారు. మొదట కాంగ్రెస్ లో ఉన్న అంబటి ఇపుడు వైసీపీలో లేరా అని అంటున్న వారూ ఉన్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే అంబటి రాంబాబు లేటెస్ట్ గా ఒక వీడియో చేసి సోషల్ మీడియాకి వదిలారు. అందులో ఆయన వైసీపీని వీడిన మాజీ నేతల గురించి ప్రస్తావిస్తూ జాలి పడ్డారు, సెటైర్లు వేశారు. వారి రాజకీయ భవిష్యత్తు మీద బెంగ కూడా పడ్డారు. అయితే దీని మీద నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. వారి రాజకీయాల గురించి అంబటి జాలి పడటం అవసరమా అని అంటున్న వారూ ఉన్నారు.
పెద్ద లిస్ట్ పెట్టుకుని : ఇక అంబటి ఒక పెద్ద లిస్ట్ ముందు పెట్టుకుని ఒక్కో నేత గురించి మాట్లాడారు. మొదటిగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనను వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా పెంచి పోషిస్తే కలలో కూడా ఎవరూ అనుకోని విధంగా పార్టీని వీడారు అని విమర్శించారు. ఆయనకు వైసీపీలో లభించినంత గౌరవం కానీ హోదా కానీ ఎక్కడా దొరకకపోవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన ఇపుడు జనసేనలో చేరినా ప్రాధాన్యత లేకుండా ఉన్నారని అన్నారు. ఆయన రాజకీయ జీవితం అయోమయంగా మారింది అని విమర్శించారు.
వీరంతా అంతేనా : ఇక ఏలూరు జిల్లాకు చెందిన ఆళ్ళ నానిని ఉప ముఖ్యమంత్రిగా జగన్ చేస్తే ఆయన పార్టీ ఓడిపోగానే టీడీపీ వైపు చూసి చివరికి అందులో చేరారు అని కానీ అక్కడ ఆయన కూడా ఏ మాత్రం సుఖంగా లేరని అంబటి తేల్చారు. రేపల్లెకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు కూడా జగన్ ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేసి ఆ మీదట రాజ్యసభ సీటు ఇచ్చినా పార్టీ మారి టీడీపీలో ఉన్నారు కానీ ఆయన రాజకీయం కూడా ఎటూ కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి వైసీపీలో మంత్రి పదవి లాటరీగా తగిలిందని అయినా ఆయన పార్టీని వీడడం శోచనీయమని అన్నారు.
అందులో చేరినా : క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కాంగ్రెస్ వైసీపీలో ఎదిగి వచ్చారని కానీ జనసేనలో ఇపుడు చేరారని ఆయన రాజకీయంగా కోరుకున్న ప్రాధాన్యత దక్కడం లేదని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కుటుంబానికి ఎమ్మెల్యే సీటు అన్నది ఒక కల అయితే దానిని జగన్ తీర్చారని అయినా ఆయన పార్టీ ఓడగానే ఫిరాయించారని అన్నారు. అయితే వీరంతా తాము చేరిన పార్టీలలో సుఖంగా అయితే లేరని అంబంటి విశ్లేషించారు.
పునరాలోచన చేసినా : ఇక వీరితో పాటు అనేక మంది పార్టీని వీడిపోయారని వీరందరికీ తాము పార్టీ మారి తప్పు చేశామని పునరాలోచించినా ఫలితం ఉంటుందా అని అంబటి సందేహం వ్యక్తం చేశారు. అంటే వైసీపీ వారిని తిరిగి తీసుకోదు అని అంబటి భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా అక్కడ ముందే ఒరిజినల్ లీడర్స్ ఉంటారని వారికి న్యాయం చేయకుండా కొత్తగా వచ్చిన వారిని ప్రాధాన్యత ఎలా ఇస్తారని అంబటి లాజిక్ పాయింట్ తీశారు. ఈ లాజిక్ ని వీరంతా మిస్ అయ్యారని కూడా అంటున్నారు.
మొత్తం మీద వారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలియదని అంబటి వారి మీద జాలి కూడా చూపించారు. అయితే రాజకీయాల్లో ఎవరు అయినా తమ సొంత నిర్ణయాలు వ్యూహాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు అని అందువల్ల ఎవరి విషయంలో ఎవరు జాలి పడినా లేక అసూయ చెందినా ఏదో అయిపోదని ఎవరి లెక్కలు వారికి ఉంటాయని అంటున్నారు. పొలిటికల్ గా సీనియర్ అయిన అంబటికి ఈ విషయం తెలియదా అని కూడా అంటున్న వారూ ఉన్నారు.
