కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్


ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.


నారాయణపేట్, డిసెంబరు1: ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) మక్తల్‌ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.

మహబూబ్‌నగర్‌ జిల్లాను పట్టించుకోలేదు..
ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

ఆటోడ్రైవర్లను రెచ్చగొడుతున్నారు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే.. ఆటోడ్రైవర్లను మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో రెచ్చగొట్టి తమ మీదకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. తమ ప్రభుత్వంలో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తుచేశారు. మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి పాలమూరును ఆదర్శంగా మారుస్తామని వివరించారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ఇరిగేషన్‌తో పాటు ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి పేద బిడ్డకు చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా స్కూళ్లు ప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది...
‘గత పాలకుల నిర్లక్ష్యానికి బలైన మక్తల్ నుంచి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా మక్తల్ నారాయణపేట కొడంగల్‌కు సాగునీరు ఇవ్వాలని ఎవ్వరికీ అనిపించలేదు. కానీ 12 మందిని మీరు ఆశీర్వదించి పంపిస్తే నాకు ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. మన కష్టాలను తీర్చేందుకు ఎవ్వరూ బాధ్యత తీసుకోలేదు. కానీ మీ సోదరుడిగా.. మీతో పాటు పెరిగిన బిడ్డగా సీఎంగా వచ్చాను. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. కానీ మోసగిస్తే పాతాళానికి తొక్కింది.. ఇది కేసీఆర్ విషయంలో జరిగింది. గతంలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి.. సీఎంగా చేస్తే.. మన జిల్లాలో ఎలాంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 

రూ.12 కోట్లు కేటాయించి సంగంబండ రిజర్వాయర్ పూర్తి చేయలేదు. అందుకే ఎవరికో పెద్దరికం ఇవ్వొద్దని.. మన బిడ్డ సీఎంగా ఉండాలని మీరు కోరుకున్నారు. మంత్రి మండలి సహకారంతో.. ఇక్కడ అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నాం.. గతంలో జీవో నెంబరు- 69 ద్వారా వచ్చిన నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టును పక్కన పెట్టారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ కొంతమంది అడ్డంకులు పెట్టారు.. కానీ మా మంత్రి వాకిటి శ్రీహరి రైతులతో మాట్లాడి.. ఎకరానికి రూ.20 లక్షల పరిహారంతో 95 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడంతో పనులు ప్రారంభించాం. ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన విషయం. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. ఈ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డుపడితే ఊరుకోం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

విద్యాభివృద్ధి ముఖ్యం..

‘విద్యాభివృద్ధి కూడా ముఖ్యం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను రూ. 200 కోట్లతో ఏర్పాటు చేశాం. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఇద్దరు గెలవక పోయినా 14 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ తీసుకువస్తున్నాం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి అడిగిన వెంటనే ట్రిపుల్ ఐటీ కాలేజీ తెచ్చాం.. పాలమూరు విశ్వవిద్యాలయంలో కావాల్సిన కోర్సులన్నీ తెచ్చా.. పాలమూరు జిల్లా విద్యాపరంగా రాష్ట్రానికి మోడల్‌గా ఉండాలి. సన్నబియ్యం, ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సు అన్నీ అమలు చేస్తున్నాం.. ఇది చాలదన్నట్లు మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు, వెయ్యి బస్సులకు యజమానులు అయ్యారు. అంబానీ, అదానీలకు సమానంగా హై టెక్ సిటీలో మా అక్కలకు స్టాల్స్ వచ్చాయి. మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

అందుకే మాకు అండగా ఉన్న పాలమూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. మా మాదిగ సోదరులు వర్గీకరణ కోసం చేయని పోరాటంలేదు.. కానీ సుప్రీంకోర్టు తీర్పు వెంటనే నేను వర్గీకరణ చేసి మాల, మాదిగ పంచాయితీ లేకుండా చేసి చూపించా. బీసీ లెక్క చేసి.. దేశానికి ఆదర్శంగా నిలిచాం. సంక్షోభం దిశలో ఉన్న రాష్ట్రాన్ని సక్కగా చేస్తున్నా. గత కేసీఆర్ ప్రభుత్వంలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టాలు పడి అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధిని చేసి చూపిస్తున్నాం. కాళ్లల్లో కట్టెలు పెట్టే వారిని సర్పంచులుగా గెలిపిస్తే.. మళ్లీ అడ్డంకులు సృష్టిస్తారు. డిసెంబరు 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టుకుని.. మన తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుదాం. 

ఇన్ని చేస్తుంటే.. మీరు సర్పంచులుగా వేరే వారిని గెలిపిస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటారు. పార్టీలను పదేళ్లు పక్కన పెడదాం.. మన పాలమూరును అభివృద్ధి చేసుకుందాం. ఈ గడ్డ దేశానికి జైపాల్‌రెడ్డి లాంటి నాయకుడిని.. మనకు బూర్గుల రామకృష్ణారావు లాటి తొలి సీఎంను ఇచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే మమ్మల్ని గెలిపించారో.. ఇప్పుడు సర్పంచులుగా కాంగ్రెస్ నేతలను ఆశీర్వదించి.. మన ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగించాలి. మీ అందరి ఆశీర్వాదం తీసుకుని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతా’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now