సైకిల్ ర్యాలీ చాలా స్పెషల్ ‘డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు"


ANDRAPRADESH, ANAKAPALLI: ‘డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు" అనే నినాదంతో ఉత్తరాంధ్రలో పోలీసులు నిర్వహించిన సైకిల్ ర్యాలీ ముగిసింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పోలీసులు ఉత్తరాంధ్రలోన ఐదు జిల్లాల్లో ఈ ర్యాలీ నిర్వహించారు. నవంబరు 13న అనకాపల్లి జిల్లాలో మొదలైన సైకిల్ యాత్ర సుమారు 1300 కిలోమీటర్లు సాగింది. 

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థులలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లాలో ముగింపు వేడుకలు శనివారం జరిగాయి. ఇచ్చాపురం పట్టణంలో అట్టహాసంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 


మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు అభ్యుదయం సైకిల్ యాత్ర చేసిన పోలీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా పట్టణ పోలీస్ స్టేషన్లో పైలాన్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ను మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పంతో ఉన్నారని, ఆయన లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతోనే పోలీసులు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారని అంటున్నారు. 

హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపు నుంచి ప్రారంభించిన సైకిల్ ర్యాలీ ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో ప్రతి ఊరి మీద నుంచి సాగింది. 23 మంది పోలీసులు నిరంతరం సైకిల్ యాత్ర చేశారు. ఇప్పటివరకు తెలుగునాట రాజకీయ లక్ష్యాలతోనే ఇలాంటి తరహా యాత్రలు జరిగేవి. కాని తొలిసారిగా ఒక సామాజిక లక్ష్యంతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. గంజాయి, డ్రగ్స్ వాడొద్దని చెప్పడమే కాకుండా, పోలీసులు ఈ విషయంలో ఎంత బలంగా పనిచేస్తామో చెప్పడం విశేషంగా చెబుతున్నారు. 

ఇక పోలీసులు ధృడమైన లక్ష్యంతో చేపట్టిన సైకిల్ ర్యాలీకి ప్రభుత్వం కూడా గట్టి మద్దతు ప్రకటించింది. ఇచ్ఛాపురంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహననాయుడుతోపాటు రాష్ట్ర హోంమంత్రి అనిత ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

పోలీసులు స్వతహాగా నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావడం వల్ల సైకిల్ ర్యాలీ చేసిన పోలీసులకు మంచి ప్రోత్సాహం అందించినట్లైందని అంటున్నారు. పోలీసులు చేసిన వినూత్న కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించి ప్రభుత్వంపై ఉద్యోగులకు గౌరవం పెరుగుతుందని, కమిట్మెంట్ తో పనిచేస్తారని కూడా చెబుతున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now