అందరూ బాగుండాలి... అందరికీ మంచి జరగాలి: డిప్యూటీ సీఎం కొట్టు ఆకాంక్ష


 
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం: అందరూ బాగుండాలి... అందరికీ మంచి జరగాలి..... అనేది తన ఆకాంక్ష అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. అదే తన దృఢ సంకల్పం అన్నారు. ఆ సంకల్పంతోనే తాడేపల్లిగూడెంలో సుమారు రెండు నెలలపాటు కొనసాగేలా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్తు నిర్వహణలో ధర్మ ప్రచార మహోత్సవాలు చేపట్టామన్నారు. 

ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి దేవతామూర్తులను ఇక్కడకు తీసుకువచ్చి విశేషమైన పూజలు, హోమాలు, కళ్యాణాలు, అభిషేకాలు వంటివి నిర్వహిస్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ బలుసులమ్మ గుడి వద్ద విశాలమైన ప్రాంగణంలో ధర్మ ప్రచార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విశిష్ట గణపతి హోమం నిర్వహించారు. కాణిపాకం దేవస్థానం నుంచి వినాయకుని తీసుకువచ్చి అక్కడ దేవస్థానంలో ఏ రీతినైతే విశిష్ట గణపతి హోమం నిర్వహిస్తారో అదే రీతిన ఇక్కడ ధర్మ ప్రచార మహోత్సవాల్లోనూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక విశిష్ట గణపతి హోమం నిర్వహించారు. 

ప్రఖ్యాత వేద పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి పర్యవేక్షణలో కాణిపాకం దేవస్థానం స్థానాచార్యులు ఫణి కుమార్ శర్మ, వైదిక కమిటీ అధ్యక్షులు సుబ్బారావు శర్మల ఆధ్వర్యంలో కాణిపాకం నుంచి వచ్చిన వేద పండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా విశిష్ట గణపతి హోమాన్ని నిర్వహించారు. వేలాదిమంది ఈ హోమంలో కూర్చున్నారు. వారి అందరికీ అవసరమైన పూజా సామాగ్రిని, తీర్థప్రసాదాలను కాణిపాకం దేవస్థానం నుంచి స్వయంగా తీసుకువచ్చి అందజేశారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సౌదనీకుమారి దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆ భగవంతుడు ఆశీర్వాదంతో దేవాదాయ శాఖ మంత్రిని అయ్యాను నాతోపాటు మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతో ఈ ధర్మ ప్రచార మహోత్సవాన్ని చేపట్టామని చెప్పారు. కాణిపాకం ఎంతో మహత్తరమైన మహిమ కలిగిన పుణ్యక్షేత్రం అని ఆయన పేర్కొన్నారు. కాణిపాకం వినాయకుడు కాలక్రమంలో ఆకృతి పెరుగుతుంటారని దానికి నిదర్శనంగా ఆయనకు ధరింపచేసే వెండి, బంగారు కవచాలను కాణిపాకంలో భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందన్నారు. 

వాటిని చూసినట్లయితే కాణిపాకం వినాయకుడు ఆకృతి కాలక్రమంలో ఏ విధంగా పెరిగింది కళ్లకు కట్టినట్లు ఉంటుందన్నారు. ఈ విధంగా ఎంతో మహిమ కలిగిన కాణిపాకం వినాయక స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ మెండుగా ఉండాలని ఉద్దేశంతో కాణిపాకం వినాయకుడి విశిష్ట గణపతి హోమం చేపట్టామని చెప్పారు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లవలసిన అవసరం లేకుండానే ప్రధాన దేవాలయాలలో జరిగే విశేష పూజా కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. పిల్లలందరూ బాగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించడానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు. 

అందరూ బాగుండాలని, అందరికీ మేలు జరగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పంతో దేవాదాయ మంత్రిగా తాను ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వివరించారు. మార్చి మూడో తేదీన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్న జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కరరావు, బలుసులమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు, కొట్టు సూరిబాబు, వట్టిప్రోలు రాము, పెదప్రోలు వెంకట భాస్కరాచార్యులు, అప్పన రమేష్ ఏఎంసీ డైరెక్టర్ గార్లపాటి వీరకుమార్, స్వామి, నున్న శ్రీ రంగనాయకులు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.