దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. విదర్భతో కర్ణాటక, ముంబయితో బరోడా, సౌరాష్ట్రతో తమిళనాడు, మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే ముంబయి తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇదే తొలిసెంచరీ కావడం విశేషం.
కష్టాల్లో ఉన్న జట్టును 18 ఏళ్ల ముషీర్ ఖాన్ వన్ మ్యాన్ షోతో ఆదుకున్నాడు. పృథ్వీ షా (33; 46 బంతుల్లో), అజింక్య రహానె (3; 13 బంతుల్లో) వంటి స్టార్ క్రికెటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ ముషీర్ ఖాన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. సాధికారికంగా ఆడుతూ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. 216 బంతుల్లో అజేయంగా 128 పరుగులు చేశాడు. పది బౌండరీలు బాదాడు. ముషీర్ ఖాన్ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు పృథ్వీ షా సాధించిన 33 పరుగులే.
ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ముషీర్ ఖాన్ భారత్ తరఫున సెంచరీల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాస్త విరామం తీసుకున్న అతడు.. ఇప్పుడు తిరిగి రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి అదరగొడుతున్నాడు. మరోవైపు అతడి సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ రాజ్‌కోట్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్ ఖాన్ సెంచరీ బాదడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ముంబయి అయిదు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్‌తో పాటు వికెట్ కీపర్ హార్దిక్ (30; 163 బంతుల్లో) అజేయంగా నిలిచాడు. భూపేన్ 19 పరుగులు, ములాని ఆరు, సూర్యాన్ష్ 20 పరుగులు చేశారు. బరోడా బౌలర్లలో భార్గవ్ బట్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. నినద్ రత్వా ఒక వికెట్ పడగొట్టాడు.