ఒక ఫంక్షన్ కోసం వెళ్లిన ఆమె.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొడుకు నడుముకు ఉండాల్సిన వెండి మెలతాడు లేకపోటంతో.. కొడుకును కొట్టేసింది. చిన్న విషయాలకే ప్రాణాలు తీసే వరకు వెళుతున్న ఉదంతాలని చూస్తున్నాం. ఆ కోవలోకే తాజా హత్య వస్తుందని చెప్పాలి. మనమడ్ని అదే పనిగా కొడుతున్న కోడల్ని చంపేసిన మామ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
తాడేపల్లిగూడెం మండలానికి చెందిన శ్రీనివాస్.. శ్రావణికి ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వారికి నాలుగేళ్ల కొడుకు, మూడేళ్ల కుమార్తె న్నారు.కొడుకు పేరు రిశాంత్ కుమార్, కుమార్తె పేరు జస్విత సూర్యశ్రీ. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. దీంతో.. మామగారి ఇంట్లోనే కోడలు.. తన పిల్లలతో కలిసి ఉంటోంది.
ఒక ఫంక్షన్ కోసం వెళ్లిన ఆమె.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొడుకు నడుముకు ఉండాల్సిన వెండి మెలతాడు లేకపోటంతో.. కొడుకును కొట్టేసింది. దీంతో ఆమెను అడ్డుకున్న మామ కేశవరావు.. ఆమెతో గొడవ పడ్డారు. ఇది కాస్తా మాటా.. మాట పెరిగేలా చేసింది. అదే రోజు రాత్రి శ్రావణి నిద్ర పోతున్న వేళలో.. ఆమె తల మీద పచ్చడిబండతో బలంగా మోదటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మనమడ్ని అదే పనిగా కొడుతుందన్న ఉద్దేశంతో తాను ఆ పని చేసినట్లుగా మామ చెబితే.. తమ కుమార్తె నాగశ్రావణిని ప్రతి చిన్న విషయానికి మామ ఇబ్బంది పెడుతుంటారని.. తాజాగా చంపేశారంటూ పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.