ఏపీలో ఎన్నికల వేళ పవన్ కేంద్రంగా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.ముఖ్యంగా పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని సవాళ్లు చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి తాజాగా షాకిచ్చారు. తన మద్దతు పవన్ కేనని తేల్చిచెప్పేశారు. అంతే కాదు నిన్న పవన్ ను నేరుగా కలిసి మద్దతు ప్రకటించారు. దీంతోపాటు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ వారించిన పవన్ భవిష్యత్తులో ఆమెకు టికెట్ ఆఫర్ ఇచ్చారు.
దీనిపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తుని వారాహి సభలో తన కుమార్తె క్రాంతికి భవిష్యత్తులో జనసేన తరఫున టికెట్ ఇస్తామంటూ పవన్ ఇచ్చిన ఆఫర్ పై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కే దిక్కులేదు, మా అమ్మాయికి టికెట్ ఇస్తానంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. పవన్ చెప్పేది సెల్లు అని, మా బతుకు మిమ్మల్ని బతకనివ్వాలని ముద్రగడ పద్మనాభం సూచించారు.
మరోవైపు కులాలు, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టాలని మీ గురువు చంద్రబాబు చెప్పారా అని ముద్రగడ ఆయన్ను ప్రశ్నించారు. చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్ మార్కెటింగ్ మేనేజర్ అన్నారు. భీమవరం, గాజువాకలో ఆయన్ను తన్ని తరిమేశారని, పిఠాపురంలో కూడా పవన్‌కు అదే జరుగుతుందన్నారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని ఆయన ప్రకటించారు.