సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డయిన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తోన్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తోన్నారు. సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయపోరాటానికీ సిద్ధపడుతున్నారు.
ప్రత్యేకించి- ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎందుకంటే- రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఊహించని మెజారిటీ విజయాలను సాధించారు. ఖచ్చితంగా గెలిచి తీరుతాయని భావించిన కంచుకోటలను సైతం వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం.. వంటి నియోజకవర్గాలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తేలా చేసిందనే వాదనలూ లేకపోలేదు. ఇటీవలే ది వైర్ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను బలపడేలా చేసింది. వీటన్నింటిపైనా దర్యాప్తు జరిపించేలా న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు ప్రశాంత్ భూషణ్.
ఈ పరిణామాల మధ్య టెక్ జెయింట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేశారంటూ ఆ దేశ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ చేసిన ఓ ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. అదృష్టశావత్తూ పేపర్ ట్రయల్ ఉండటం వల్ల ఈవీఎంల దుర్వినియోగాన్ని గుర్తించగలిగినట్లు చెప్పారు.
ఎన్నికల్లో ఈవీఎంలను రద్దు చేయాల్సిన అవసరం ఉందని, మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తాము వేసే ప్రతి ఓటు కూడా లెక్కించేలా ఆ దేశ ప్రజలు అప్రమత్తం కావాలని రాబర్ట్ సూచించారు. తాను అధికారంలోకి వస్తే ఈవీఎంల వినియోగాన్ని రద్దు చేస్తాననీ తేల్చి చెప్పారు.