కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ


కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యతలను అప్పగించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బీజేపీ ఇంఛార్జీలను నియమించింది. ఇందులో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్‌కు బీజేపీ ఎన్నికల ఇంఛార్జీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. మహారాష్ట్రకు కేంద్రమంత్రులు భూపేంద్ర యాదవ్(ఇంఛార్జీ), అశ్వనీ వైష్ణవ్ (సహ ఇంఛార్జీ)లను నియమించింది. హర్యానాకు ఇంఛార్జీగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ కుమార్ సహ ఇంఛార్జీగా నియమితులయ్యారు. జార్ఖండ్ రాష్ట్రానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంఛార్జీగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సహ ఇంఛర్జీగా నియమిస్తూ సోమవారం బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.


మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, జమ్మూకాశ్మీర్ లోనూ ఈ ఏడాది సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇంఛార్జీలను నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి జూన్ 19న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రానున్నారు. కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ ర్యాలీతో పాటు బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డీ, బండి సంజయ్‌లకు బీజేపీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ తీయనున్నారు. ఆ తర్వాత నేతలు వారిని సన్మానించనున్నారు. మరోవైపు, చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దర్శించుకోనున్నారు.