అసెంబ్లీకి రాకపోతే అదే అర్థం... రేవంత్ హాట్ కామెంట్స్!


అసెంబ్ల్లీ వేదికగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసీఆర్ తమతో కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరవ్వడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో అయితే కాస్త అనారోగ్యంగా ఉన్న సంగతి పక్కనపెడితే ఇప్పుడు ఫిట్ గానే ఉన్నట్లు కనిపిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలనే డిమాండ్లు రోజు రోజుకీ బలంగా వినిపిస్తున్నాయి. అంత భయపడాల్సిన పనేమీ లేదంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. 


ఈ నేపథ్యంలో... బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా... కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందనే చర్చ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తున్న ఆయన.. ఈ అన్యాయంపై నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ చర్చలో పాల్గొనాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే లేదని, మరోసారి మోడీ & కో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సమయంలో... కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులు, అనుమతుల గురించి అసెంబ్ల్లీ వేదికగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసీఆర్ తమతో కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. 

ఇలా తన కోరిక మేరకు అసెంబ్లీలో పెట్టబోయే చర్చలో పాల్గొంటేనే కేసీఆర్ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినట్లని.. అలా కాని పక్షంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాదిరిగానే కేసీఆర్ కూడా మోడీ దగ్గర మోకరిల్లినట్లుగానే తాము భావిస్తామని తెలిపారు. దీంతో... ఇంత కీలకమైన చర్చకు కేసీఆర్ హాజరవుతారా.. లేక, రేవంత్ లేవనెత్తిన సందేహానికి బలం చేకూరుస్తారా అనేది ఆసక్తిగా మారింది. కాగా... 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయింపులపై మోడిచేయి చుపించారంటూ కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కనీసం ఏ ఒక్క విషయంలోనూ తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే... అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.. ఆ చర్చలో కేసీఆర్ పాల్గొనాలని డిమాండ్ చేశారు.