ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీకి అన్ని రకాలుగానూ వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారంటూ ఢిల్లీలో జగన్ ఓ పక్క ధర్నా చేస్తుంటే.. మరో పక్క పార్టీలో పెద్దలు తనను మానసికంగా ఇబ్బడులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తాజాగా రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే మద్దాల గిరి రాజీనామా చేయగా.. ఇప్పుడు తాజాగా కిలారి రోశయ్య పార్టీని వీడారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీకి అన్ని రకాలుగానూ వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఓ పక్క కార్యకర్తల్లో భయాందోళనలు పెరిగాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... మరో పక్క మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు.. వరుసగా పార్టీ అధినేతకు రాజీనామా లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు.
బుధవారం గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు.. పార్టీకి నష్టం చేసేవారికి ప్రమోషన్లు ఇస్తున్నారని ఘాటు విమర్శలు చేస్తూ, పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి! వాస్తవానికి వైసీపీలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అల్లుడైన కిలారి రోశయ్య 2019లో పొన్నూరు నుంచి వైసీపీ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మారెడ్డి కుమారుడు వెంకట రమణను తొలుత గుంటూరు ఎంపీ అభ్యర్థిగ ప్రకటించారు. తర్వాత రోశయ్యను అక్కడ నుంచి బరిలోకి దింపారు.
ఈ ఎన్నికల్లో రోశయ్య ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన... ఈ కీలక ప్రకటన చేశారు. అయితే... రాజీనామా అనంతరం ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందనే ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి! దీనిపై వీలైనంత త్వరలో ప్రకటన రావొచ్చని అంటున్నారు! ఇప్పటికే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాసిన రాజీనామా లేఖలో పార్టీపై ఎలాంటి ఆరోపణలూ చేయకుండా.. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కిలారి రోశయ్య మాత్రం రాజీనామా సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది!