వైఎస్ జగన్ పేరు కట్..!!


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన మరో పథకం పేరును మార్చింది. దానికి ఎన్టీఆర్ పేరును పెట్టింది.


జగన్ హయాంలో అమలులోకి వచ్చిన పలు సంక్షేమ పథకాల పేర్లను చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ మార్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో దాదాపుగా అన్ని నవరత్న పథకాలూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అనే పేర్లు ఎక్కడా కనిపించకుండా చూసుకుంది ప్రభుత్వం.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌, జగనన్న విదేశీ విద్యా దీవెన- అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి వైఎస్ఆర్ కల్యాణమస్తు- చంద్రన్న పెళ్లికానుక, వైఎస్ఆర్ విద్యోన్నతి- ఎన్టీఆర్‌ విద్యోన్నతి, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం- ఇన్సెంటివ్స్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, వైఎస్ఆర్ పెంఛన్ కానుక- ఎన్టీఆర్ పెంఛన్ కానుక అని మార్చింది. ఇప్పుడు తాజాగా మరో పథకం పేరు మార్చింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లకు కొత్త పేరు పెట్టింది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌‌గా నామకరణం చేసింది. 

ఈ మేరకు మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 30.75 లక్షల మందికి సొంత ఇంటిని సమకూర్చాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ అమలు చేసిన పథకం ఇది. 2020లో వారం రోజుల పాటు ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. అర్హుల పేర్ల మీద ఇళ్ల పట్టాలను అప్పటికప్పుడు రిజిస్టర్ చేయించారు. వాటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించారు.