అక్రమ నిర్మాణాల కూల్చివేత అడ్డగింత


ప్రకాశం జిల్లా, మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఐదేళ్ల కాలంలో సాగిన అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న పలు బహుళ అంతస్థుల భవనాల యజమానులకు నోటీసులిచ్చారు. పలుమార్లు నోటీసులిచ్చినా యజమానులు పట్టించుకోలేదు. దీంతో మున్సిపాలిటీ అధికారుల ప్రణాళికకు విరుద్ధంగా నిర్మించిన ఎనిమిది భవనాలకు సంబంధించి అదనపు అంతస్థులను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 


ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక కళాశాల రోడ్డులోని తాటిపత్రి అశోక్‌రెడ్డికి సంబందించిన బహుళ అంతస్థుల భవనం వద్దకు మున్సిపాలిటీ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో తమ భవనంలో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన రెండు అంతస్థులను తొలగించా లంటే ముందు పట్టణంలోని మిగిలిన అక్రమ నిర్మాణా లను కూల్చాలని అడ్డం తిరిగారు. భవన యజమానితో మాట్లాడుతుండగానే వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మున్సిపల్‌ ఛైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్లు గుంటక సుబ్బారెడ్డి, గొలమారి శ్రీనివాసరెడ్డిలు అక్కడకు చేరుకున్నారు. పట్టణంలో ఎక్కడా లేనట్లు వైసీపీ సానుభూతిపరుల భవనాలే మీకు కనిపించాయా? అంటూ మున్సిపల్‌ అధికారులపై మాజీ ఎమ్మెల్యే రాంబాబు మండిపడ్డారు. 

కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేదిలేదని అధికారులపై ధ్వజమెత్తారు. అయితే అధికారులు తాము చట్టప్రకారం నడుచుకుంటామని, ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా భవనాల యజమానులు స్పందించలేదని కమిషనర్‌ కిరణ్‌ సమాధానం చెప్పారు. నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన కార్మికులను పైఅంతస్థుకు వెళ్లకుండా సుమారు 100 మంది అడ్డుకోవడంతో మున్సిపల్‌ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

పట్టీపట్టనట్లు వ్యవహరించిన పోలీసులు
అక్రమ నిర్మాణాలు తొలగించేటప్పుడు భవన యజమానులు గొడవలకు దిగే అవకాశం ఉన్నట్లు గ్రహించిన మున్సిపల్‌ అధికారులు ముందుగానే పోలీసు లకు సమాచారం అందించారు. ఉదయం 9.00 గంటల కల్లా సుమారు 20 మంది సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న పట్టణ, గ్రామీణ ఎస్సైలు అబ్దుల్‌ రెహమాన్‌, వెంకటేశ్వర్లు నాయక్‌లు గొడవ జరుగుతున్నా, చోద్యం చూశారు. మున్సిపల్‌ అధికారులను, కార్మికులను వైసీపీ నాయకులు, భవన యజమాని బందువులు భవనం లోపలికి వెళ్లడానికి అడ్డంతిరిగినా ఎస్సైలు కానీ సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

ఏదో మొక్కుబడిగా అక్కడకు వచ్చి ప్రేక్షకపాత్ర పోషించి వెళ్లిపోయారు. పోలీసుల తీరుతో ఏమీ చేయాలో పాలుపోని మున్సిపల్‌ అధికారులు, కార్మికులు వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంది. అనంతరం ఘటనపై మున్సిపల్‌ కమిషనర్‌ ఈ కిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు తాటిపర్తి అశోక్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్సై అబ్దుల్‌ రెహమాన్‌ కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందు కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వారం రోజులు గడువు ఇచ్చాం
కళాశాల రోడ్డులోని తాటిపత్రి అశోక్‌రెడ్డికి సంబందించిన బహుళ అంతస్థుల భవనం నిర్మాణంలో చాలా లోపాలున్నాయి. వాటిని సవరించుకోవాలని ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చాం. కానీ నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతోనే ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించేందుకు శుక్రవారం ఉపక్రమించాం. కానీ భవన యజమానులు వారం రోజులు గడువిస్తే తామే అన్నింటినీ తొలగించుకుంటా మని చెప్పారు. వారం రోజులుల్లోగా వాళ్లు అక్రమ నిర్మాణాలను తొలగించుకోకుంటే తప్పకుండా పట్టణ ప్రణాళిక విభాగం కూల్చివేస్తుంది. - ఇ.కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌