శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక జాతర వేడుకల్లో వేదోక్తంగా శ్రీచక్రనవావరణార్చన


27న గురువారం, లోక కళ్యాణార్థం అమ్మ వార్లకు కుంభ జలాభిషేకం 

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణ ఇలవేల్పు దేవత 
శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక ఉగాది జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), వెంకట రామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయకమిటీ సారథ్యంలో ఏప్రియల్ 2వ తేదీ వరకూ జరగనున్న జాతర ఉత్సవాల్లో రెండవరోజైన బుధవారం 108 మంది ముత్తైదువులచే శ్రీచక్రనవావరణార్చన ఆలయ మండపంలో ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సర్వ దేవతా నిలయమైన గోమాతకు ముందుగా గోపూజ నిర్వహించారు. కాగా సాయంత్రం అమ్మవారు మాడ వీధుల్లో గ్రామోత్సవం చేశారు. అనంతరం కండ్రికగూడెం శ్రీషిర్దీ సాయి భజనమండలి వారిచే సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో భజన జరిగింది.

శ్రీచక్ర విశిష్టతపై ప్రవచనం అందిస్తూ శివయ్యను లింగరూపంలో, విష్ణువును సాలగ్రామ రూపంలో, శక్తి స్వరూపిణి అమ్మను శ్రీచక్ర రూపంలో అర్చిస్తామని, లౌకిక జీవితంలో కామ్యకకర్మల సాఫల్యానికి శ్రీచక్రార్చన అమ్మవారి నుండి తక్షణ అనుగ్రహం అందిస్తుందని, నిష్కామకర్మ జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని తద్వారా మోక్షానికి చేరుస్తుందని శంకరభగవత్పాదులు నిర్దేశించిన శక్తిఆరాధనా క్రమమని, భావనాత్మకంగా అనుభూతిపొందే అవకాశం పాల్గొన్న స్త్రీమూర్తులకు అమ్మవారు అందిస్తారని అర్చక స్వాములు అన్నారు.

ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) మాట్లాడుతూ 1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించే సంప్రదాయం పూర్వీకులు అందించిన క్రమం అనుసరిస్తూ నేడు 61వ వార్షిక జాతర జరుపుకోవడం ఆనందాన్ని అందించే అంశమని, 2వ తేదీ వరకూ ఉత్సవాలు జరుగుతాయని, భక్తులకు ఆహ్వానం పలుకుతూ మూడవరోజైన గురువారం ఉదయం విశేష ద్రవ్యాలతో, పంచామృత, సప్తనదీ జలాలతో అమ్మ వార్లకు అభిషేకం ఆలయకమిటీ నిర్వహిస్తోందని, స్వర్ణవర్ణ పూర్ణ కవచంతో అమ్మవారి దర్శనం లభిస్తుందని, సాయంత్రం శ్రీ అభయాంజనేయ స్వామి భజన బృందం వారిచే కోలాటం జరుగుతుందని తెలిపారు.

సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జలాభిషేకం 1964 నుండి వేంచేసి యున్న శ్రీ నూకాలమ్మ అమ్మ వారికి భక్తులే స్వయంగా జలాభిషేకం చేసుకునే సదవకాశాన్ని ఆలయకమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రసాద వితరణ జరిగింది. ఉదయం నుండి అమ్మవారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

ప్రతినిధి,
ఏలూరు జిల్లా.