ANDHRA PRADESH, MANGALIGIRI: 2019లో అయితే మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మీద గెలిచి సత్తా చాటారు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్న వారందరికీ తెలుస్తుంది. ఆయన 2014, 2019లలో వరసగా మంగళగిరి నుంచి గెలిచారు. 2019లో అయితే మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మీద గెలిచి సత్తా చాటారు. ఆ విధంగా జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.
లోకేష్ మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తాను అని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అది అయిదేళ్ళు వేచి చూసినా అమలు కాలేదు. దాంతో మొదట్లో ఉన్న ఉత్సాహం కాస్తా రాను రానూ తగ్గిపోయింది. దాంతో ఆళ్ళ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆ మధ్యలో కనిపించారు. ఇక ఆళ్ళకు కాకుండా టీడీపీ నుంచి వచ్చి గంజి చిరంజీవికి పెద్ద పీట వేయడం ఆయనకు బాధించింది.
ఆయన పార్టీ మీద వైరాగ్యంతో ఒక దశలో కనిపించకుండా పోయారు ఆ మీదట ఆయన వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కానీ అతి కొద్ది రోజులలోనే వెనక్కి వచ్చి వైసీపీలో చేరారు. అయితే ఆ సమయంలో గంజి చిరంజీవికి కాకుండా మురుగుడు లావణ్యకు టికెట్ ఇప్పించారని టాక్ నడచింది.
ఆమె వెనక ప్రచారం చేసి 2024 ఎన్నికల్లో తనదైన పనితీరు కనబరచారు. కానీ కూటమి ప్రభంజనంతో పాటు నారా లోకేష్ అయిదేళ్ళ పాటు మంగళగిరిని అట్టేబెట్టుకుని ఉండడం వల్ల ఆయన భారీ మెజారిటీతో గెలిచారు.
ఇక అప్పటి నుంచి ఆళ్ళ సైలెంట్ అయిపోయారు. వైసీపీలో తనను దూరం పెట్టడం, టికెట్ ఇవ్వకుండా వేరే వారికి పార్టీ టికెట్ ఇవ్వడం ఆయనకు కోపం తెప్పించాయని చెప్పుకున్నారు. వైసీపీ ఓటమి పాలు అయి పది నెలలు కనిపిస్తున్నా ఆళ్ళ ఊసే లేకుండా పోయింది అని అంటున్నారు.
అయితే ఆళ్ళ ఇప్పటప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఆ మధ్యన ఆయనను సత్తెనపల్లి వెళ్ళమని పార్టీ కోరిందని వార్తలు వచ్చాయి. అయితే దానికి ఆయన మౌనమే జవాబు అయింది అని అంటున్నారు. తాను మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తాను అని ఆయన భావిస్తున్నారుట.
తనకు మంగళగిరి ఇంచార్జి ఇస్తేనే గేర్ మార్చి స్పీడ్ పెంచేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మంగళగిరిలో పదేళ్ళ పాటు ఎమ్మెల్యగా చేసిన ఆళ్ళకు బలమైన వర్గం ఉంది. దాంతో పాటు ఆయన మళ్ళీ ఇంచార్జిగా వస్తేనే మంగళగిరిలో పార్టీ జోరు అందుకుంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ మళ్ళీ ప్రయోగాలు చేసి ఆళ్ళను సత్తెనపల్లి పంపించాలని చూస్తే మాత్రం అక్కడా ఇక్కడా చెడుతుందని అంటున్నారు.
పార్టీని అత్యంత నిబద్ధతతో పనిచేసే ఆళ్ళ లాంటి వారి సేవలు ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు చూస్తే లోకేష్ ని ఓడించినా మంత్రి పదవి దక్కలేదని పార్టీలో ఆఖరుకు ఉన్న చోట కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వకపోతే ఎలా అన్నది కూడా ఆళ్ళ వర్గీయుల ఆవేదనగా ఉందిట. ఆళ్ళ రీ యాక్టివ్ కావాలంటే డెసిషన్ అధినాయకత్వం చేతిలోనే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఫ్యాన్ పార్టీలో ఏమి జరుగుతుందో. మంగళగిరిలో నారా లోకేష్ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఎవరు వస్తారో.