ANDRAPRADESH: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ పథకం.. తొలి దశ పూర్తయింది. గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన తొలిదశ.. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగింది. సుమారు 84 లక్షల మందికి ఈ పథకం కింద.. ఉచితంగా గ్యాస్ ఇవ్వాలన్నది ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. అయితే.. వీరిలో 1/3 వంతకుపైగా.. అసలు బుక్ చేసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్న మాట. వీరికి విషయం తెలియకపోవడమే కారణమని సమాచారం.
ఇప్పటికీ తొలి దశకు సంబంధించిన రాయితీ సొమ్ము వారి ఖాతాల్లోకి పడలేదు. ఇది కూడా అధికార వర్గాలు చెబుతున్న లెక్క ప్రకారం తెలుస్తోంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ పథకంలో సొమ్ములు ఎందుకు జమ కాలేదన్నది తేల్చాల్సి ఉంటుంది. పైగా.. ఇంత జరుగుతున్నా.. ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఉభయ గోదావరి జిల్లాలు సహా.. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరంలో లక్షల మంది ఈ పథకం అందుకోలేక పోయారు.
అదేవిధంగా సీమలోనూ.. అనేక మంది ఈ పథకానికి ఎంపికైనా.. లబ్ది మాత్రం అందలేదు. విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల కూడా.. ఇంకా తమకు సొమ్ములు పడలేదని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నవారి సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే.. తొలి దశ పూర్తయిందని.. ఆవిషయాన్ని ఇక మరిచిపోవాలని గ్యాస్ ఏజెన్సీలు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నాయి. మర వైపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో దశ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ప్రభుత్వం రెడీ అయింది.
తొలి దశ అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న చాలా మంది ఇప్పుడు దీనిపై ఆసక్తి చూపించడం లేదు. రెండో దశ ప్రారంభమై మూడు రోజులు గడిచినా.. కేవలం వందల్లోనే గ్యాస్ బుక్ చేసుకున్నార ని తెలిసింది. అయితే.. దీనికి ఇంకా నాలుగు మాసాల వరకు సమయం ఉందని.. కాబట్టి ఇప్పుడే తొందర అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ,తొలి దశ విఫలమైందన్న చర్చ నేపథ్యంలో మలి దశపై ప్రజల్లో ఇంట్రస్ట్ లేకపోవడం వాస్తవం. ఈ ప్రభావాన్ని తగ్గించుకోకపోతే.. ఈ పథకం కింద.. ప్రభుత్వం ఆశిస్తున్న మేలు జరగకపోయే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.