4.23 లక్షల మంది వేతనదారులకు వేతనాలు రూపంలో రూ. 312.57 కోట్లు చెల్లింపు..
రానున్న మూడు నెలల్లో మరో 90 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యం..
అందరికి పనికల్పించి ఉపాధిహామీ పనుల్లో పురోగతి చూపాలి..
ఏలూరు: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా 2024-25 లో ఇంతవరకు కోటి 23 లక్షలు పనిదినాలు కల్పించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి పంచాయితీలో ఉపాధిహామీ పధకం పనులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3.77 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కోటీ 20 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంగా ఇంతవరకు కోటీ 23 లక్షల(103శాతం) పనిదినాల లక్ష్యాన్ని సాధించామన్నారు. ఇంతవరకు 4.23 లక్షల మంది వేతనదారులకు రూ. 312.57 కోట్లు వేతనాలు చెల్లించామన్నారు. రానున్న మూడు నెలల్లో మరో 90 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.
అందరికీ ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అదే విధంగా 2024-25 సంవత్సరంలో 206 కోట్ల రూపాయలతో రోడ్లు, తదితర మౌలిక సదపాయాలు కల్పించామన్నారు. భూగర్భజలాల అభివృద్ధికి గాను 5 వేల ఫారంపాండ్లు త్రవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్బంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం ద్వారా తమ్మిలేరులో పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీల దగ్గరకు వెళ్లి కలెక్టర్ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలు వారి పనిచేసిన దానికి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి లేనిదీ ఆరాతీశారు.
అదేవిధంగా కూలీల హాజరు పట్టిక పనిప్రదేశంలో త్రాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పనిచేసుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధిహామీ పదకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, డ్వామా పిడి కె. వెంకట సుబ్బారావు, తహశీల్దారు శ్రీనివాసరావు, దెందులూరు నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె. రఘరామయ్య తదితరులు ఉన్నారు.