ఏలూరు, దెందులూరు, పెదపాడు: 2024-25 రబీ సీజనులో పంట ఉత్పత్తులకు ప్రభుత్వం చే నిర్ణయించిన కనీస మద్దతు ధర అందేలా జిల్లా వ్యాప్తముగా తగు ఏర్పాట్లు చేయుట జరిగిందనీ, పప్పు ధాన్యాల కొనుగోలుకు సైతం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా ఆర్ఎస్ కే, సహకార సంఘాల సమన్వయంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమైనదని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు.
దళారుల బెడద లేకుండా రైతులకు న్యాయం చేసేందుకు సదరు కొనుగోలు నకు బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయబడుతోందని, సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్‌ఎఫ్ ఐడీ ట్యాగ్ కూడా వేస్తున్నారనీ తెలిపారు. జిల్లాలోని దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 1,922 మెట్రిక్ టన్నుల పెసలను సేకరించాలనే లక్ష్యాన్ని నిర్ధారించగా, ఇప్పటికే సదరు లక్ష్యాన్ని అధిగమించి 2,095 మెట్రిక్ టన్నుల పెసలను కొనుగోలు చేయుట జరిగిందనీ, తద్వారా సేకరించిన పెసల విలువ రూ. 18,19,70,379/- లుగా తెలియజేశారు.
అంతేకాకుండా ఇంకా దిగుబడులొస్తాయన్న క్షేత్ర స్థాయి నివేదికల ఆధారముగా పెసల కొనుగోలు లక్ష్యాన్ని పెంచవలసినదిగా కోరుతూ ప్రతిపాదనలు పంపగా సదరు లక్ష్యాన్ని 2,745 మెట్రిక్ టన్నులకు పెంచుతూ ప్రభుత్వము నుండి అనుమతి లభించిందని అన్నారు. అలాగే ఆర్ఎస్ కె (RSK) ల ద్వారా రబీ ధాన్య సేకరణ జరుగు తీరుతెన్నులపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తముగా ఇప్పటికే గ్రామసభలు/అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు.
రైతులకు ధాన్య సేకరణలో ఏ విధమైన అసౌకర్యము కలగకుండా సరిపడా గన్నీసంచులు ఏర్పాటు చేయుటతోపాటు ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరుగకుండా, జనరేట్ చేస్తున్న ప్రతీ ధాన్యం ట్రక్ షీట్ ను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా మండల, జిల్లాస్థాయి అధికారులంతా పరస్పర సమన్వయము తో వ్యవహరిస్తూ దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు ధరను పొంది ఆర్థికంగా బలపడేలా రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు.
రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మరింత సమాచారము/ఫిర్యాదుల నిమిత్తము జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం; 08812-230448, 7702003584, 7569562076 మరియు 7569597910 లను సంప్రదించవచ్చునని తెలిపారు.