ANDRAPRADESH: : మాజీ మంత్రి ఆర్ కే రోజా అడ్డంగా బుక్ అయిపోయారు. వెతకబోయే తీగ కాలుకు తగినట్లు.. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వానికి కీలక ఆధారాలు లభించాయి. అయితే ప్రభుత్వం, పోలీసులు ఏమీ కష్టపడి ఆ ఆధారాలు సంపాదించలేదని చెబుతున్నారు. డిప్యుటేషన్ పై క్రీడాశాఖలో పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ అధికారి ఇంటి వ్యవహారంతో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి బయటపడింది. దీంతో మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి చిక్కులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఆర్ కే రోజా అవినీతి వ్యవహారాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో రోజా భారీ అవినీతికి పాల్పడ్డారని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి రూ.119 కోట్లు ఖర్చుచేశారని, ఆ డబ్బు ఖర్చుకు సంబంధించి అన్ని బిల్లులు ఉన్నాయని మాజీ మంత్రి రోజా వివరణ ఇస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’లో ఎలాంటి అవినీతి జరగలేదని వివరణ ఇచ్చారు.
రోజా వివరణ నేపథ్యంలో విచారణ జరుపుతున్న పోలీసులు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తర్జనభర్జన పడుతుండగా, ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి టెండర్లు పర్యవేక్షించిన ఓ ఇంజనీరింగు అధికారి అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. విజయవాడలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఓ మహిళ అకౌంటుకు రూ.12 కోట్లు డబ్బుతో పాటు కొంత భూమి రాసిచ్చేయడంతో వివాదం చెలరేగింది. తమ డబ్బు, భూమి వెనక్కి ఇవ్వాలంటూ ఆ మహిళతో ఇంజనీరింగు అధికారి బంధువులు తగాదా పడటంతో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి వెలుగు చూసినట్లైంది.
‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి మొత్తం రూ.119 కోట్లు వెచ్చించగా, ఇందులో సుమారు రూ.70 కోట్లు వరకు దుర్వినియోగమైనట్లు కూటమి ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఇంజనీరింగు అధికారి ఇంటి గుట్టు రట్టు అవడంతో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతికి సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లైంది. అంతేకాకుండా మాజీ మంత్రి రోజా మెడకు ఉచ్చుబిగించేందుకు అవకాశం చిక్కినట్లైందని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన ఇంజనీరింగు అధికారి గత ప్రభుత్వంలో డిప్యుటేషన్ పై శాప్ కు వచ్చారు.
‘ఆడుదాం ఆంధ్రా’ టెండర్ల ప్రక్రియను అంతా ఆయనే పర్యవేక్షించినట్లు చెబుతున్నారు. ఈ టెండర్ల ఖరారులో అవినీతితో సొమ్ముతో మూడు వేర్వేరు అకౌంట్ల ద్వారా తన సన్నిహితురాలి అకౌంటుకు రూ.12 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆ డబ్బు కోసం వారు గొడవ పడటంతో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి గుట్టు రట్టు చేసినట్లైంది. దీంతో మాజీ మంత్రి రోజా ఏం చెబుతారనేది ఆసక్తి రేపుతోంది.
అయితే, తన సన్నిహితురాలి అకౌంటుకు బదలీ చేసిన డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం తన స్నేహితులు సమకూర్చారని సదరు ఇంజనీరింగు అధికారి పోలీసులకు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చినందుకే ముడుపుల కింద ఆ డబ్బు ముట్టినట్లు అనుమానిస్తోంది. దీనిపై సీఐడీ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఇంజనీరింగు అధికారి ఇంటి గుట్టు రచ్చకు చేరి మాజీ మంత్రి రోజా మెడకు చుట్టుకుందని ప్రచారం జరుగుతోంది.