చంద్రబాబు సీఎం కాదు...మరి ?


ANDRAPRADESH: ఏపీ సీఎం గా నాలుగవ సారి అధికారం అందుకున్న చంద్రబాబుని సీఎం కాదు అని ఎవరైనా అనగలరా. అసలు అలా ఆలోచించగలరా. కానీ ఏపీలో జనం మాత్రం ఆయనను అలా చూడడం లేదు. మరి ఎందుకలా అంటే అదే బాబులో గొప్పతనం. జనాలు ఆయనను తమ ఇంటి పెద్దగా చూస్తున్నారు. అయిదు కోట్ల ప్రజానీకానికి కుటుంబ యజమాని గా చూస్తున్నారు. 


వయసుతో పాటు మానసిక పరిపక్వత దానంతట అదే వస్తుంది. బాబు విషయానికి వస్తే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ చిన్నతనం నుంచే చాలా అధికమని చెప్పాలి. ఆయన చాలా కూల్ గా ఉంటారు. ఏ విషయం అయినా కూల్ గానే ఆలోచిస్తారు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా సంక్షోభాలు ఎన్ని ఎదురొచ్చినా వాటిని సవాల్ గా తీసుకుని మరీ సమాధానం చెప్పగల దిట్ట. 

ఆయనలో ఆగ్రహం చూసిన వారు తక్కువ. పట్టుదలను చూసిన వారే ఎక్కువ. ఇక నలభైలలో ఇవన్నీ సాధించిన బాబు ఇపుడు ఏడున్నర పదుల వయసులో ఎంత నిదానంగా ఉంటారో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసుకు తగిన హుందాతనంతో ఒక ఇంటి పెద్దగా ఇపుడు కనిపిస్తున్నారు. పిల్లలకు తాతయ్యగా నడి వయసు వారికి ఒక మంచి అంకుల్ గా పెద్దలకు సహచరుడిగా ఇలా విభిన్న పాత్రలలో ఆయన కనిపిస్తున్నారు. దానికి తోడు బాబు నడవడిక ఆయన క్రమశిక్షణ కూడా మరింతగా ఆకట్టుకుంటున్నాయి. చూసేవారికి బాబు మాకు పెద్దగా ఉన్నారు అండగా ఉన్నారు అన్న ధీమా లభిస్తోంది. 

అందుకే బాబు వద్దకు వెళ్ళిన వారు ఎవరైనా సీఎం తో వ్యవహరించినట్లుగా ఉండరు. తమ ఇంటి మనిషితో ఉన్నట్లుగా ఉంటారు. బాబు కూడా ఆ చనువు వారికి ఇస్తున్నారు. వారితో కలసిపోతున్నారు. ఇటీవల విద్యార్థులు బాబుని కలసి ఎంత మురిసిపోయారో వేరేగా చెప్పాల్సింది లేదు. వారితో కలసి బాబు గ్రూప్ ఫోటో దిగి తాను కూడా అంతే ఆనందం అనుభవించారు. 

నెలకు ఒక మారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తూ బాబు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్తున్నారు. అక్కడ వారితో కులాసా కబుర్లు చెబుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ వారికి టీ కాచి తానే స్వయంగా అందిస్తూ ఒక ఆత్మ బంధువుగా మారిపోయారు. ఇలా ఆప్యాయతతో ప్రతీ గుండె తలుపుని తడుతున్న బాబుని ముఖ్యమంత్రి అని ఎవరూ భావించడం లేదు. మా ఇంట్లో వారే అని అనుకుంటున్నారు. 

బాబు సీఎం అయిన కొత్తల్లో అంటే 45 ఏళ్ల వయసులో చాలా దూకుడుగా ఉండేవారు. ఆయన నిర్ణయాల్లో ఆ జోరు కనిపించేది. అపుడు ఆయన తాను సీఎం కాదు సీఈవో అన్నట్లుగా వ్యవహరించేవారు. కానీ ఇపుడు చూస్తే బాబు సీఎం కాదు మనింటి మనిషి అన్నట్లుగా కనిపిస్తున్నారు అంటే నిజంగా అది ఆయనలో రాజకీయ అనుభవం తెచ్చిన మార్పుగానే చూడాలని అంటున్నారు. 

పరిపాలకుడు అంటే రాజు అని గద్దె మీద కూర్చుని జనాలకు కనబడకుండా హుకుం జారీ చేసేవారు కాదు జనంతో కలసిపోయి వారి కష్టాలలో తాను ఉన్నాను అని పలికేవారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఆ ప్రజలు తమలో ఒకరిని పెద్దగా ఎన్నుకుంటారు. ఆ పెద్ద గద్దె మీద ఎక్కగానే ప్రజలను మరచిపోతే ప్రభువులు చూస్తూ ఊరుకోరు. తమ ఓటు ఆయుధంతో వెంటనే దించుతారు. 

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తూ వారి మధ్యనే ఉండేవారే అసలైన ప్రజా నాయకులు. బాబు ఒకనాడు అపర రాజకీయ మేధావిగా అపర చాణక్యుడిగా పేరు గడించారు. ఈ రోజుకీ ఆ బిరుదులు ఆయనకు ఉన్నాయి. ఇపుడు కొత్తగా ఆయన సాధించినది ఏంటి అంటే ప్రజా నాయకుడు అన్న బిరుదుని. ఇది ఆషామాషీగా రాదు. బాబు జనంతో మమేకం అయిన తీరుని బట్టే వచ్చింది. అది అందరికీ సాధ్యం కాదు. జనాల వద్దకు వెళ్తే ఏమి అడుగుతారో అని కొందరు నాయకులకు భయం. వారు ఏమి అడిగినా తాను ఉన్నాను అన్న భరోసా ఇవ్వడం బాబుకు మాత్రమే తెలిసిన విద్య. 

అందుకే ఆయనకు జనాలు అంటే ఇష్టం. వారి ఎక్కువగా కలవడం అంటే ఇష్టం. వారికి కూడా ఆయన అంటే అంత ఇష్టం. అందుకే ఆయనను సీఎం కాదు మా ఇంటి మనిషి అని అనుకుంటున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎవరికైనా సహజం. బాబు మాత్రం వీటికి అతీతంగా జనాభిమానం నిండుగా సంపాదించుకున్నారు అన్నది మాత్రం సత్యం.