మాజీ ఎమ్మెల్యే కొడుకు మహా అవినీతి.. లంచం కోటి.. గిఫ్ట్ 2 కోట్ల ఫ్లాట్


హైదరాబాద్‌ ఆదాయపు పన్ను కమిషనర్‌ అయిన జీవన్‌ లాల్.. ముంబైకి చెందిన ఎన్‌డీడబ్ల్యూ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.2.5 కోట్ల విలువైన ప్లాట్‌ ను లంచంగా పొందినట్లు తేలింది.

ఆయన ’ఆదాయ’ పన్ను ఉన్నతాధికారి.. తండ్రి మాజీ ఎమ్మెల్యే.. భార్య పోలీస్ ఉన్నతాధికారి.. కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడింది. కానీ, డబ్బు అనేది ఎవరినీ ఆగనివ్వదు కదా..? అందుకే ప్రతి అప్పీల్ కు డబ్బులు.. ఒక్కోదానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు.. బినామీలు.. హవాలా ఖాతాలు.. గత వారం సీబీఐకి చిక్కిన ఈ అధికారి తెలుగువాడే. సంచలనం రేపిన ఈ కేసులో కొత్తగా మరో కీలక విషయం బయటపడింది.

ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్ ముంబైలో ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ నుంచి రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌ ఆదాయపు పన్ను కమిషనర్‌ అయిన జీవన్‌ లాల్.. ముంబైకి చెందిన ఎన్‌డీడబ్ల్యూ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.2.5 కోట్ల విలువైన ప్లాట్‌ ను లంచంగా పొందినట్లు తేలింది. అయితే, సొంత జిల్లా ఖమ్మంకు చెందిన బినామీ వ్యక్తి అయిన దండెల్‌ వెంకటేశ్వర్లు పేరిట దీన్ని రిజిస్ట్రేషన్ చేశారట.

షాపూర్ జీ పల్లోంజీ, ఎన్డీడబ్ల్యూ నుంచే కాక.. మరో రెండు ముంబై సంస్థల నుంచి కూడా రూ.35 లక్షలు లంచం తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు జీవన్ లాల్ ఎక్కడికక్కడ మధ్యవర్తులను నియమించుకున్నట్లు సీబీఐ పరిశీలనలో తేలింది.

అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అసలు దస్త్రాలు తనవద్ద ఉంచుకున్నట్లు కూడా గుర్తించింది.

ప్రాథమిక దర్యాప్తులోనే రూ.కోట్లలో సంపాదన అని తేలగా.. పూర్తిస్థాయి దర్యాప్తులో అది మరి ఇంకెన్ని కోట్లు ఉంటుందో అని భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి కనీసం రూ.15 లక్షలు ఇంకా చెప్పాలంటే రూ.20 లక్షలు తీసుకున్నట్లు సీబీఐ భావిస్తోంది.

జీవన్ లాల్ పట్టుబడిన షాపూర్జీ పల్లోంజీ కేసులో ఆ సంస్థ ట్యాక్స్ ఫైలింగ్ ను క్లియర్‌ చేసేందుకే రూ.1.20 కోట్లు లంచం అడిగారని సీబీఐకి స్పష్టమైన సమాచారం ఉంది. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు తీసుకోగా.. తర్వాత రూ.70 లక్షలు తీసుకుంటుండగా సీబీఐకి దొరికపోయారు.