ANDRAPRADESH, TELANGANA: ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే.. బుధవారం ఏకంగా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావునే కోల్పోయారు. BY: BCN TV NEWS దళపతి లేని దళంగా మిగిలిన మావోయిస్టులను ఇకమీదట నడిపించేది ఎవరు? వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి మళ్లీ కోలుకునేలా చేసేది ఎవరు? మునుపటి వైభవం సాధించగలిగేలా చేసేది ఎవరు? అసలు కొత్త సారథి ఎవరు? అంటే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేని పరిస్థితి. కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్ లో చిక్కుకున్న మావోయిస్టులు.. వందల సంఖ్యలో నేతలు, క్యాడర్ ను కోల్పోయారు. ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే.. బుధవారం ఏకంగా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావునే కోల్పోయారు. ఇది పూడ్చలేని నష్టం అనడంలో సందేహం లేదు. మరి కేశవరావు వారసుడు ఎవరు?
70 ఏళ్ల కేశవరావు తెలుగు వ్యక్తి. 2004లో మావోయిస్టు పారీ‍్ట ఏర్పాటైంది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి చాలాకాలం పాటు అధిపతిగా ఉన్నారు. 2018లో వైదొలగారు. తాజాగా మరణించిన కేశవరావు కూడా పార్టీ చీఫ్‌గానే ఉన్నారు. మరి ఈయన స్థానంలో వచ్చేవారూ తెలుగువారే అని చెబుతున్నారు. వారు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనుగా పేర్కొంటున్నారు. తిరుపతి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్. మావోయిస్టు పార్టీ సాయుధ విభాగం ఇది. వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగం బాధ్యతలు చూస్తున్నారు.
తిరుపతి దళిత వర్గం వారు. వేణుగోపాలరావు అగ్ర వర్ణం వారు. 2011లో చనిపోయిన మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావుకు సోదరుడు కూడా. అయితే, 622 ఏళ్ల తిరుపతి, 70 ఏళ్ల వేణుగోపాల్ ఇద్దరిదీ తెలంగాణనే. తిరుపతి పార్టీ చీఫ్ అయితే దళితులతో పాటు.. ఆదివాసీల్లోకి చొచ్చుకెళ్లి ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పార్టీలో మల్లోజుల, నంబాల తర్వాతి తరం నాయకులు తిరుపతి, వేణుగోపాల్‌లు. ఇప్పడు పెద్ద నాయకులను కోల్పోయిన పరిస్థితుల్లో వీరిలో ఒకరికి చాన్స్ ఉంటుంది.
ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాలలో పుట్టిన తిరుపతి, పెద్దపల్లిలో జన్మించిన వేణుగోపాల్‌లు అంచలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదిగారు. వేణుగోపాల్ అభ్యర్థిత్వం పట్ల పార్టీలో సీనియర్లు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. కోటేశ్వరరావు సోదరుడు కావడంతో ఈయనకు కాస్త మొగ్గు ఉంది. ఈ నేపథ్యంలో సాయుధ విభాగ నాయకుడైన తిరుపతికి పగ్గాలు ఇస్తారా? లేక సైద్ధాంతిక విభాగం చూస్తున్న వేణుగోపాల్‌కు అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. హోదా కాకున్నా.. కొన్ని అంశాల్లో వేణుగోపాల్‌ను మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం పెద్ద లీడర్‌గా పరిగణిస్తున్నారు. పార్టీ చీఫ్ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆశిస్తున్నారు. పెద్ద నాయకత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తదుపరి అడుగులపై ఇప్పటికే నిఘా వర్గాలు కన్నేశాయి.