సరస్వతి పుష్కరాల విశిష్టతలేంటి... పుణ్యస్నానాలు ఎక్కడ ఆచారించాలంటే..!


TELANGANA, SARASWATHI PUSKARALU: హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ప్రారంభమవుతాయి. BY: BCN TV NEWS బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించిన సమయం నుంచి 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మే 15వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకు సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అంతర్వాహిని సరస్వతి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, చేపట్టిన ప్రతి పనుల్లో మంచి విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా సరస్వతీ నది ఎక్కడ పుట్టింది.. పుష్కరాల చరిత్ర ఏంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఎక్కడ పుట్టిందంటే..
పురాణాల ప్రకారం, బుుగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన వచ్చింది. హిమాలయ పర్వతాల్లో శివాలిక్ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించినట్లు బుుగ్వేదంలో పేర్కొనబడింది. అంతేకాదు దాయది దేశమైన పాకిస్థాన్‌లో హక్రా, భారత్‌లోని గగ్గర్ నది.. అప్పటి సరస్వతి నది అని చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందని నమ్ముతారు. అయితే కొన్ని వేల ఏళ్ల కిందటే భూగర్భం, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతి నది అదృశ్యమైపోయింది.

మిథున రాశిలో గురుడి ప్రవేశం..
భూగర్భంలో ఈ నది ఇంకా ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలిసి ప్రవహిస్తుంది. బృహస్పతి(గురుడు) ఏడాదికి ఒక రాశి చొప్పున ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మిథున రాశిలోకి సంచారం చేసే సమయంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి.

అంతర్వాహిని నదిగా..
తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం సమీపంలోని గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహితలో కలుస్తుంది. ఈ రెండు నదుల సంగమం అయ్యే చోట సరస్వతి నది అంతర్వాహినీగా కలుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక్కడే మహా సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తుంటారు.

అలకనంద నదిలో..
బద్రినాథ్ సమీపంలో ఉన్న మనా గ్రామంలోనూ సరస్వతి నదిని చూడొచ్చు. అక్కడ కొంత దూరం ప్రవహించి.. అలకనంద నదిలో కలిసిపోతుంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి కలుస్తుంది. ఈ త్రివేణి సంగం జరిగే ప్రాంతంలో సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తారు. దీంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం, రాజస్థాన్‌లోని పుష్కర్ ప్రాంతంలోని బ్రహ్మ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని బేడాఘాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతుంటాయి.

గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.