జగన్‌కు బిగ్ షాక్.. చంద్రబాబు సర్కార్ ఆదేశాలు


వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. కడప మేయర్ కే సురేష్ బాబుతోపాటు మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌ను పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


అమరావతి: మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌కు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. BY; BCN TV NEWS  మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తురకా కిషోర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఏపీ మున్సిపల్ యాక్ట్‌లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు అతడిని ఈ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గత 15 మున్సిపల్ కౌన్సిల్ మీటింగులకు ఆయన హజరు కాలేదని తేలడంతో ఈ పదవి నుంచి అతడిని తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం తురకా కిషోర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు ఛైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేసిన కేసులో చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ఇప్పటికే తురకా కిషోర్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తురకా కిషోర్‌ను మాచర్ల ఛైర్మన్ పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం పల్నాడులోని మాచర్లలో టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న పర్యటించారు. ఈ సందర్భంగా వారి పర్యటిస్తున్న కారుపై తురకా కిషోర్ దుడ్డు కర్రతో దాడి చేశాడు. ఈ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే వైసీపీ నేత, కడప మేయర్ కే సురేష్ బాబు‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆయన్ని తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంలో మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం మేయర్ సురేష్ బాబును మున్సిపల్ ప్రిన్సి‌పల్ సెక్రటరీ సురేశ్ కుమార్ అమరావతిలో విచారించారు. అయితే తనకు రెండు వారాల గడువు కావాలని మేయర్ కోరారు. మేయర్ వివరణపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. దీంతో ఆయన్ని సైతం కడప మేయర్ పదవి నుంచి తొలగిస్తూ.. ఉత్తర్వులను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో.. ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఆ పార్టీని వీడిరు. తాజాగా అంటే.. మే 14వ తేదీన వైసీపీ ఎమ్మెల్సీ జాకీయా ఖానమ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆమె మండలిలో డిప్యూటీ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాకీయా ఖానమ్.. తన ఎమ్మెల్సీ పదవికి ఇంత అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది.