జ‌గ‌న్ పర్య‌ట‌న‌.. వంద‌ల‌మంది జైలుకు!


ANDRAPRADESH, PALNADU: మాజీ సీఎం వైయస్ జగన్ ప‌ల్నాడు పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలపై పలు కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు అడ్డంకి కలిగించారనీ, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. బహుశా ఈ పర్యటన దెబ్బతో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జైలు పాలవుతారనడం ఖాయం.


నిన్న వైసీపీ కార్యకర్తలు భారీగా వస్తున్నారని తెలుసుకొని పోలీసులు కంటెపూడి వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే అంబటి రాంబాబు స్వయంగా వాటిని తొలగించేందుకు ప్రయత్నించాడు. అందుకే అతని మీద కేసు నమోదు చేశారు. అలాగే జగన్ పర్యటనలో ప్లకార్డ్ ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

“2029లో వైసీపీ వచ్చిన వెంటనే రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని” అనే ప్లకార్డు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.

జగన్ పర్యటన నేపధ్యంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప‌ల్నాడు ఎస్పీ మాట్లాడుతూ – “జగన్ పర్యటన ఆంక్షలకు విరుద్ధంగా సాగింది. వైసీపీ నేతలు వారి అనుచరులతో తిరిగారు. వారు పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అందువల్ల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు. దీంతో జగన్‌పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.

జగన్ పర్యటనకు 100 మంది, 3 కార్లు, పలు ఆంక్షలతో పోలీసులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప‌ల్నాడు జిల్లా మొత్తం పోలీసులు రకరకాల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. కొంతమంది పోలీసులు క‌ళ్ళ‌గ‌ప్పి పొలాల వెంట పరిగెత్తుతూ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దాదాపు 80 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి 10 గంటల సమయం పట్టిందంటేనే పరిస్థితి అర్థమవుతుంది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now