'రప్పా.. రప్పా.. నరుకుతాం..' ఈ ప్లెక్సీ ప్రదర్శించిన కార్యకర్తది ఏ పార్టీ?


ANDRAPRADESH, PALNADU: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన రాజకీయంగా వేడిపుట్టిస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో గత ఏడాది మరణించిన వైసీపీ గ్రామస్థాయి నేత నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం జగన్ పరామర్శించారు. అయితే ఆయన పర్యటనకు కేవలం వంద మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతోపాటు సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వరకు 20 చెక్ పోస్టులు, సెక్షన్ 30 విధించారు. కానీ, జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు వైసీపీ భారీగా జనాలను సమీకరించింది. పోలీసు చెక్ పోస్టులను తొలగించడమే కాకుండా, వివాదాస్పద ప్రకటనలతో ప్లెక్సీలను ప్రదర్శించింది. దీనిపై తాజాగా కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం వందల మంది వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.


జగన్ పర్యటనకు వెళ్లిన పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పలు సెక్షన్ల కిందట కేసులు పెట్టడంతోపాటు జగన్ పర్యటన సందర్భంగా 2029లో జగన్ 2.0 మొదలైతే ‘రప్పా.. రప్పా.. నరుకుతాం’ అనే వివాదాస్పద ప్లెక్సీని ప్రదర్శించిన కార్యకర్తపైన కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ ప్లెక్సీలను ప్రదర్శించింది వైసీపీ కార్యకర్త రవితేజగా పోలీసులు చెబుతున్నారు. 88 తుళ్లూరు గ్రామానికి చెందిన రవితేజపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే రవితేజకు వైసీపీతో ఎటువంటి సంబంధం లేదని వైసీపీ చెబుతోంది.

మాజీ సీఎం జగన్ పర్యటనలో రప్పా.. రప్పా అనే ప్లెక్సీని ప్రదర్శించిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అంటూ వైసీపీ కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. పోలీసులు అరెస్టు చేసిన రవితేజకు టీడీపీలో సభ్యత్వం ఉందని ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ ఆరోపించారు. నిందితుడు రవితేజను వైసీపీ కార్యక్రమానికి పంపింది ఎవరో పోలీసులు తేల్చాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ రవితేజ ఏ పార్టీకి చెందిన వాడన్నది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

మరోవైపు జగన్ పర్యటనపై వీడియో రికార్డు చేసిన పోలీసులు అనుమతి లేని ర్యాలీలో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తిస్తూ అరెస్టు చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. దాదాపు వంద మంది వరకు వైసీపీ కార్యకర్తలపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్ పర్యటనకు వంద మందికి మాత్రమే అనుమతిచ్చారు. అదేవిధంగా జగన్ కాన్వాయ్ లో 3 కార్లు మించి ఉండకూడదని షరతులు విధించారు. కానీ, జగన్ పర్యటనలో దాదాపు 300 కార్లు ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం వెళ్లటానికి 10 గంటలు సమయం తీసుకోవడం అనుమతి లేకుండా ర్యాలీ చేయడం, సాధారణ జన జీవనానికి ఆటంకం కలిగించారనే ఆరోపణలు చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి జగన్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now