విజయవాడ వెంకన్న ఆలయ‌ంలో.. 12 ఏళ్ల తరువాత..

VIJAYWADA:విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహా సంప్రోక్షణ.. శాస్త్రోక్తంగా ఆరంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు శ‌నివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వరకు మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వ‌హించారు.

టీటీడీ అనుబంధ ఆల‌యాల‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహా సంప్రోక్షణ చేపట్టడం ఆచారంగా వస్తోంది. అయిదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహా సంప్రోక్షణలో భాగంగా..

ఈ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల‌ వరకు అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తారు అర్చకులు. సాయంత్రం 6:30 గంట‌లకు కళాపకర్షణ, ఉక్త హోమాలలు చేపడ‌తారు.

28వ తేదీన ఉదయం 9 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య నవగ్రహారాధన, ప్రధాన హోమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంట‌లకు ఉక్త హోమం, కుంభారాధన, అభిమంత్రణము నిర్వహిస్తారు.

29వ తేదీన ఉదయం 9 గంట‌లకు సర్వ శాంతి హోమం, సాయంత్రం 6:30 సర్వ దోష ఉపశమనార్ధం సహస్రాహుతి హోమం నిర్వ‌హించ‌నున్నారు.

30వ తేదీ ఉదయం 9 గంట‌లకు అష్టబంధన ద్రవ్యారాధన, మహా శాంతి హోమాలు, ఉష్ణ బంధనం, అష్టబంధ ప్రయోగం, సాయంత్రం 4 గంట‌లకు సర్వ దోషప్రాయశ్చిత్త శాంతి హోమాలు, 7 గంట‌లకు మహా శాంతి తిరుమంజనం, ధాన్యా ధివాసం, సర్వ దైవత్య హోమం నిర్వ‌హిస్తారు.

31వ తేదీ ఉదయం 7:30 గంట‌లకు మహా పూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం చిత్త నక్షత్రం, తులా లగ్నంలో ఉదయం 11:25 నుండి మ‌ధ్యాహ్నం 12:24 నిమిషాల వరకు మంగళ కళావహనం, ప్రథమ కాలార్చన, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష తదితర కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

తిరుమలలో సీఎస్..

కాగా- ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనను టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఘనంగా స్వాగతించారు. రాత్రి గాయత్రి రెస్ట్ హౌస్ లో సీఎస్ బస చేశారు.

కొనసాగుతున్న రద్దీ..

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 73,576 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,227 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.23 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 12 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now