కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు నాయకుల పనితీరుతో పాటు.. అధికారులు, మంత్రుల పనితీరును కూడా గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేయించుకుంటున్నారు.
ANDHRAPRADESH,ANANTAPUR:కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు నాయకుల పనితీరుతో పాటు.. అధికారులు, మంత్రుల పనితీరును కూడా గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల్లో పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? జిల్లాల రాజకీయాలు ఎలా నడుస్తున్నాయన్న కోణంలోనూ ఆయన పరిశీలన చేస్తున్నారు. ఇలా.. జిల్లా గ్రాఫ్‌ల పరంగా అనంతపురం జిల్లా పరిస్థితి ఎలా ఉందన్నది ఆసక్తిగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ, బీజేపీలు క్లీన్ స్వీప్ చేశాయి. ధర్మవరంలో బీజేపీ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల వరుస విజయాలు.. మరికొన్ని చోట్ల తొలి-మలి విజయాలు కూడా దక్కించుకుంది. అంతేకాదు.. ఈ దఫా తాడిపత్రి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వారసులు, తొలిసారి పోటీ చేసిన వారు విజయం దక్కించుకున్నా రు. దీంతో జిల్లాలో దూకుడు మామూలుగా ఉండదని అనుకున్నారు. అనుకున్నట్టుగానే దూకుడు ఎక్కువగానే ఉంది. కానీ, ఎటొచ్చీ.. ఆ దూకుడు ప్రజలకు కలిసి వచ్చేలా కనిపించడం లేదు. అలాగని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలానే ఉందా ? అంటే.. కొన్ని ప్రశాంతంగా పని చేసుకుంటున్న నియోజకవర్గాలు ఉన్నాయి.
మరికొన్ని నియోజకవర్గాల్లో నిరంతరం ఘర్షణలు, వివాదాలకు కేంద్రాలుగా నాయకులు మారారు. తాడిపత్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కల్యాణదుర్గంలో ఇప్పుడు సొంత పార్టీ నాయకులే కత్తులు దూసుకుంటున్నారు. వాస్తవానికి ప్రత్యర్థుల నుంచి వివాదాలు వస్తాయని ఎవరైనా అనుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా వాతావరణం ఉంది. ఇక, రాప్తాడులో యథాతథంగానే రాజకీయాలు సాగుతున్నాయి. ఎటొచ్చీ.. ధర్మవరంలో కూటమి నాయకుల మధ్య అస్సలు పడడం లేదు. పైకి అందరూ బాగానే ఉన్నారని అనుకున్నా.. తేడా కొడుతోంది.
రాయదుర్గంలో పనులు ప్రశాంతంగానే సాగుతున్నా.. హిందూపురంలో మాత్రం అలజడి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి వరుసగా విజయాలు దక్కించుకున్న బాలయ్య కనిపించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఇక్కడ బాధ్యతలను ఒకరికి అప్పగించినా.. ప్రజలకు మాత్రం సంతృప్తి కలిగించలేక పోతున్నారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా జిల్లా వ్యాప్తంగా మిశ్రమ పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని వివాదాలు.. మరిన్ని విమర్శలతో అనంత పురం రాజకీయాలు కాక రేపుతున్నాయి. అభివృద్ధి పనుల తీరు.. చాలా అంటే చాలానే మందకొడిగా ఉందన్నది స్థానిక కూటమి నాయకులే చెబుతున్నారు. ఏదేమైనా.. ఇక్కడి రాజకీయాల తీరు మారితేనే ప్రజలకు ఊరట లభిస్తుందన్నది వాస్తవం.

Shakir Babji Shaik
Editor | Amaravathi