మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ తాను తాడిపత్రి వెళ్తానంటూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భీష్మించారు. ఆయన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన బయలు దేరేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే భైఠాయించారు.
ANDHRAPRADESH:అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ‘చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకుంటామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటనతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ తాను తాడిపత్రి వెళ్తానంటూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భీష్మించారు. ఆయన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన బయలు దేరేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే భైఠాయించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. తమ పార్టీ కార్యక్రమానికి తనను వెళ్లనీయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దారెడ్డి. ఏడాదిగా పోలీసులు తనను తాడిపత్రిలో అడుగు పెట్టనీయడం లేదని, కోర్టు అనుమతి ఇచ్చినా తనను వెళ్లనీయకపోవడం అన్యాయమన్నారు. ఆరు నూరైనా తాను తాడిపత్రి వెళ్తానంటూ పెద్దారెడ్డి పట్టుబట్టారు.
మరోవైపు తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తల సమావేశం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాక కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే పెద్దారెడ్డి ఎలా వస్తారో చూస్తామంటూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి వర్గాల మధ్య చిరకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా, జేసీ అనుచరులను వేధింపులకు గురిచేశారని పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో యుద్ధవాతావరణం నెలకొంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi