HYDERABAD:రోడ్డు ప్రమాదంగా భావించిన ఉదంతంలో హత్య కోణం బయటకు రావటం పోలీసు వర్గాల్ని సైతం ఉలిక్కిపడేలా చేసింది. అవును.. మెదక్ జిల్లాకు చెందిన అధికార పార్టీ యువ నేత మరణం.. ఇప్పటివరకు అనుకున్నట్లు రోడ్డు ప్రమాదం కాదని.. హత్య చేశారన్న వాదనకు బలం చేకూరేలా ఆధారాలు లభించటం కలకలాన్ని రేపుతోంది. అసలేం జరిగిందంటే..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు మారెల్లి అనిల్ కుమార్.ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. పెట్రోల్ బంకు నిర్వహిస్తున్న ఆయన.. సోమవారం రాత్రి మెదక్ నుంచి సొంతూరుకు కారులో బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టుకు ఆయన కారు ఢీ కొట్టింది. ఆపై పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ఉదంతంలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగినంతనే.. అక్కడున్న కొందరు ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో.. ఈ విషాద ఉదంతానికి కారణం మితిమీరిన వేగంతో కారు నడపటం.. ప్రమాదం జరిగి మరణించినట్లుగా పోలీసులు భావించారు.
అయితే.. ఈ కేసు విచారణలో భాగంగా విచారణ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లటం.. అక్కడ బుల్లెట్లు లభించటంతో షాక్ తిన్న పరిస్థితి. అప్పటివరకు భావించినట్లుగా అనిల్ మరణం.. ప్రమాదం కాదని హత్య అన్న సందేహం తెర మీదకు వచ్చింది. దీంతో.. దీని వెనుక ఉన్న అసలు మిస్టరీని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపుతోంది.