HYDERABAD:తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం. ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన సమయం నుంచి కోమటిరెడ్డి అనేక సందర్భా ల్లో కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ సీఎం అయిన తరువాత పరిస్థితిలో మార్పు కనిపించింది. కాగా, రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లో స్థానం ఆశించారు. ఢిల్లీ లెక్కల్లో ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ లక్ష్యంగా కోమటిరెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనంగా మారుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ తాజాగా పాలమూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పుకొచ్చారు. గతం లోనూ రేవంత్ ఇదే తరహా లో వ్యాఖ్యలు చేసారు. కాగా.. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యల పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు
పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పటం పై రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు చేసిన ట్వీట్ లో ..రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు సహించరు... అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ పార్టీలో వైరల్ అవుతోంది.