HYDERABAD:హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ నటీనటులకు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు
ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో తెలంగాణ కళాకారుల ఫోటోలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ మేరకు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ మేరకు తెలంగాణ కార్యకర్తలు ఆంధ్ర గో బ్యాక్ , జై తెలంగాణ వంటి నినాదాలు చేశారు. నిరసన కారులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లోకి ప్రవేశించడానికి యత్నించగా, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కళాకారుల ఫోటోలు లేకపోవడంపై ప్రశ్నించినందుకే తమను కిందకు లాగారని పాశం యాదగిరి పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో కుల, ప్రాంతీయ వివక్ష ఉందని, ఇది కొనసాగితే పరిశ్రమలో రాణించలేరని ఆయన హెచ్చరించారు. "చంద్రబాబు ఏజెంట్లు తెలంగాణలో ఉండకూడదు, ఆంధ్రా గో బ్యాక్" అని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పాశం యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణ కళాకారులు, రచయితలను కించపరిచే విధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే తప్పును సరి దిద్దుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.