INDIA:తత్కాల్ టికెట్ల బుకింగ్ నిబంధనలలో భారతీయ రైల్వే గణనీయమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి సంబంధించి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ నెల మొదటి తేదీ అంటే జులై 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. ఇప్పుడు ఐఆర్సీటీసీ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) తప్పనిసరి కానుంది. ఈ నియమం ఎందుకు అవసరమో, దాని ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం
అసలు రూల్ ఎందుకు మార్చాల్సి వచ్చింది?
ఇప్పటివరకు తత్కాల్ టికెట్‌ను బుక్ చేయడం సాధారణ వినియోగదారుడికి యుద్ధం చేయడం లాంటిదే. తత్కాల్ టికెట్ విండో ఓపెన్ వెంటనే దళారులు, నకిలీ ఏజెంట్ల కారణంగా నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోయేవి. దీనివల్ల అవసరమైన సాధారణ ప్రయాణికులకు టికెట్లు లభించక నిరాశ చెందేవారు. తత్కాల్ టికెట్‌కు సంబంధించిన నియమంలో ఆధార్ ప్రామాణీకరణ మార్పు రైల్వే ద్వారా ఇదే సమస్యకు పరిష్కారంగా తీసుకురాబడింది. దీని ద్వారా సాధారణ ప్రయాణికులు తత్కాల్ టికెట్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పనిలో మోసాలకు పాల్పడేవారిపై అడ్డుకట్ట పడుతుంది.
నమోదిత వినియోగదారులు మాత్రమే టికెట్లను బుక్ చేయగలరు..
భారతీయ రైల్వే ఇటీవల తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలలో మార్పులకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జులై 1 నుంచి ఆధార్ ప్రామాణీకరణ ద్వారా ఐఆర్సీటీసీలో తత్కాల్ టికెట్ బుకింగ్ నియమం అమలులోకి రాగా.. ఓటీపీ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేయడానికి జులై 15, 2025 తేదీని నిర్ణయించారు. రైల్వే చేసిన ఈ మార్పు ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ చేస్తున్న వినియోగదారుల ఆధార్ నంబర్ నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ నియమాలలో మార్పులు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు వర్తిస్తాయి.
ఆధార్ ఓటీపీ ప్రామాణీకరణ ఎలా పని చేస్తుంది?
తత్కాల్ టికెట్ల మోసాలను అరికట్టడానికి రైల్వే ప్రారంభించిన ఈ ప్రక్రియ ద్వారా టికెట్ బుకింగ్ చాలా సులభం అవుతుంది. వినియోగదారు ఆధార్ కార్డుకు లింక్ అయిన ఐఆర్‌సీటీసీ ఖాతా నుంచి తత్కాల్ టికెట్‌ను బుక్ చేసినప్పుడు..ఈ ప్రక్రియలో ఆధార్‌తో పాటు ఆ వినియోగదారుల నమోదిత మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)వస్తుంది. దీనిని సమర్పించిన తర్వాతే మీ టికెట్ బుకింగ్ ఖరారు అవుతుంది. ఆన్‌లైన్ టికెట్ టికెట్ బుకింగ్‌లోనే కాకుండా ఇప్పుడు కౌంటర్ నుంచి తత్కాల్ టికెట్లను పొందడానికి కూడా ఆధార్, ఓటీపి తప్పనిసరి.
30 నిమిషాల నియమం కూడా వర్తిస్తుంది.
సాధారణ ప్రయాణికులు తత్కాల్ టికెట్లను సులభంగా పొందడానికి భారతీయ రైల్వే చేసిన నియమ మార్పులలో మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఇప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల వరకు ఏసీ, నాన్-ఏసీ కోసం ఆధార్ ప్రామాణీకరించిన సాధారణ వినియోగదారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఏజెంట్లు దీని తర్వాతే బుక్ చేయగలరు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఏసీ క్లాస్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ కోసం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మార్పు ద్వారా సాధారణ ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు లభించిన సులభం అవుతుంది.