విజయవాడ నగరంలో లులు మాల్ ఏర్పాటు కు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం లులు గ్రూప్ కు కేటాయించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరు మలరావుకు ఇటీవల లేఖ రాశారు. ప్రస్తుతానికి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఆ స్థలాన్ని లులు మాల్‌కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఆర్టీసీ ఎండీకి సూచన వచ్చినట్లు సమాచారం. గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో సుమారు 5 ఎకరాల్లో ఉంది. ఇక్కడ గవర్నర్‌పేట-2తో పాటు, ఒకటో డిపోకి చెందిన బస్సులను కూడా ఉంచుతారు.
అయిదు ఎకరాల స్థలంలో ఈ డిపో ఉంది. 1, 2 ఆర్టీసీ డిపోల మేనేజర్ల ఆఫీసులు సైతం ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమిని లులు మాల్ కోసం ఇస్తే, ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి 5 ఎకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆ భూమికి సంబం ధించిన వివరాలను సైతం ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పెట్టుబడు ల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం గురువారం జరగగా, అందులో లులు గ్రూప్‌సంస్థ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఐరన్ స్క్రాప్ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది. దీనిని కూడా లులు మాల్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖపట్నంలో లులు గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల కోసం బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలంటూ వీఎంఆర్డీఏకు ఈ ఏడాది మార్చి నెలలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi