ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కాకినాడలో రంగరాయ వైద్య కళాశాలలో బిఎస్సి డిప్లమా ఇన్ మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల కొందరు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ల్యాబ్ సహాయకుడు మరియు మరో ఉద్యోగి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి పైన కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు.
విద్యార్థినులపై కీచక పర్వం
ఈనెల 8వ తేదీన కొంతమంది విద్యార్థులు ల్యాబ్ అటెండెంట్, మరో ఉద్యోగి పైన లైంగిక వేధింపులు, అసభ్యకర ప్రవర్తన తదితర అంశాలపై ఆరోపణలు చేశారు. వారి సెల్ ఫోన్ లో తమ శరీర భాగాల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు విద్యార్థినులు పేర్కొన్నారు. గత నెల రోజులుగా ఇది జరుగుతుందని వారు ప్రిన్సిపల్ ముందు వాపోయారు. దీంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు.
లైంగిక వేధింపులపై 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు
ఈ క్రమంలో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ విభాగాలలో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని, తాము శాశ్వత ఉద్యోగులమని ఎవరు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. తమను కళాశాలలో ఉన్న కీచకుల బారి నుండి కాపాడాలని వారు కోరారు.
రంగరాయ మెడికల్ కాలేజీ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం
దీంతో విద్యార్థినుల ఆరోపణల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ చేయించింది. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ ఘటనపైన ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు.
చర్యలకు సీఎం ఆదేశం, వారు అరెస్ట్
దీంతో ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. కళాశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi