గ్రోయిన్స్ కు గండి పడింది.. అక్టోబరులోనూ వెంటాడుతున్న వరదలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం: ఎప్పుడు వరదలు వచ్చినా బడుగువానిలంక గ్రామంపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ శ్రేష్టమైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతుంటాయి. ఇప్పటివరకు అలా నదిలో కొట్టుకుపోయిన భూములు ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 800 ఎకరాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో ఈ గ్రామంలో నదీకోత అధికంగా ఉండే చోట గ్రోయన్స్(నీటి వేగాన్ని అడ్డుకునేది), రివిట్మెంట్ నిర్మించారు.
అప్పటినుంచి ఆ ప్రాంతంలో నది కోత తగ్గింది. అయితే ఈ రివిట్మెంటు లేని ప్రాంతాల్లో కోతకు గురవుతుంది. దీంతో రెండేళ్ళ క్రితం రిలయన్స్ గ్యాస్ పైపు లైన్ సంస్థ వారు సుమారు రూ. 42 కోట్లతో మరి కొంతమేర రీవిట్మెంట్ పనులు చేపట్టారు. అయితే గత మూడు రోజులుగా ఈ కొత్త పాత రివెట్మెంట్లు మధ్యన కోత మొదలైంది. పాత రెవిట్మెంట్ కు గండిపడి పొలాల్లోకి చొచ్చుకు పోతుంది. బర్మా సొసైటీ(రెడ్లు లంక)కు చెందిన రెండు చోట్ల ఇప్పుడు నదీ కోత విపరీతంగా ఉంది.
కేవలం ఈ మూడు రోజుల వ్యవధిలోనే అరటి, దొండ, గులాబీ వంటి పంటలతో ఉన్న ఈ భూములు కళ్ళముందే కొట్టిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా కొనసాగితే లంక భూములు తర్వాత జిరాయితీ భూములతో పాటు బడుగువానిలంక గ్రామానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకనే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ప్రదేశంలో మళ్లీ రివిట్మెంట్ పనులు చేపట్టాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ మొదటివారంలో కూడా వరదలు కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే జూలైలో ప్రారంభమయ్యే వరద నీరు సెప్టెంబర్ మూడో వారానికి పూర్తిగా తగ్గుముఖపడుతుంది. ఒక్కొక్క సందర్భంలో నీరు తెల్లబడిపోవడం కూడా జరుగుతుంది. కాని ఈ ఏడాది మూడవ ప్రమాద స్థాయికి వరద నీరు చేరుకోలేదు కాని ఒకటి, రెండు ప్రమాద హెచ్చరికల స్థాయిలోనే రోజులు తరబడి ఉండిపోయింది. శుక్రవారం కూడా ధవళేశ్వరం బ్యారేజి వద్ద 11.50 అడుగుల నీటిమట్టం ఉంది.
తొమ్మిది లక్షల 41 వెల 775 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి పెట్టారు. ఈ ఏడాది సరాసరిన రోజుకు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని ఆగష్టు మూడవ వారం నుండి ఇప్పటి వరకూ సముద్రంలోకి వదిలిపెడుతూనే ఉన్నారు. ఇలా ఇన్ని రోజులు పాటు నిండు గోదావరి ప్రవహించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పవచ్చు. అందుకునే ఈ రివెట్మింట్ వద్ద ఊబ ఏర్పడి గండి కొట్టేసి ఉంటుందని రైతులు వాపోతున్నారు.