తిరుమల, డిసెంబర్ 28: అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యావసర పరిస్థితిలో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడకమార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ 20వేల నుండి 30వేల మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. వారి సౌకర్యార్థం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్య సహాయం పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దిగువ ఘాట్ రోడ్డులో ఆనుకుని ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండటంతో వాహనదారులు కూడా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకుని సౌకర్యాలపై సలహాలు, సూచనలు అందిచవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.కుసుమ కుమారి, సీనియర్ మెడకల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.కుసుమ కుమారి, వీజీవో శ్రీ రామ్ కుమార్, అశ్వనీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
