వైఎస్ కుటుంబంలోచీలిక.. పులివెందులలో పోరు


Kadapa: నిన్నటి నుంచి పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన భర్తను మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆమె ప్రచారం నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. పులివెందులలో తన భర్త జగన్ కు మద్దతుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. అది ఎప్పుడూ జరిగేదే. గత ఎన్నికల సమయంలోనూ వైఎస్ భారతి పులి వెందుల నియోజకవర్గంలో మాత్రమే పర్యటించి తన భర్త జగన్ ను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రజలను కోరారు. ఆమె గత ఎన్నికల్లో పులివెందుల నియోజకవార్గానికే పరిమితమయ్యారు.


కానీ ఈసారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆమె పర్యటించి కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంటే కడప పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని గెలపించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేేస్తుండగా, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ఆడబిడ్డ ఓటమికి వైఎస్ భారతి నేరుగా రంగంలోకి దిగినట్లయింది. వైఎస్ షర్మిలను ఓడించాలని నేరుగా ఆమె చెప్పకపోయినా.. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఓటు వేయమంటే వైఎస్ షర్మిలను ఓడించమన్నట్లే కదా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


కడప నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిన నేపథ్యంలో వైఎస్ భారతి ఎంట్రీ చర్చకు దారి తీసింది. ఒకవైపు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తుంటే వైఎస్ భారతి మాత్రం తన భర్తను గెలపించాలని, వైసీపీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది చూసేవారికి కొంత ఆశ్చర్యంగా కనిపిస్తున్నా.. వైఎస్ భారతిని ఆప్యాయంగా పలకరిస్తూ పులివెందుల ప్రజలు తమ ఇంట్లోకి రావాలని ఆహ్వానిన్తున్నారు. షర్మిల పేరు నేరుగా ప్రస్తావించకపోయినా అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ముందుకు వెళుతున్నారు. పులివెందుల ప్రజలు ఈ కుటుంబసభ్యుల రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.


ఈసారి పులివెందులలో జగన్ కు లక్షకు పైగా మెజారిటీ వస్తుందని తెలిపారు. ఇక్కడి ప్రజలు జగన్ ను మరోసారి అత్యధిక మెజారిటీతో ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె అన్నారు. పులివెందులకు వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబానికి పులి వెందుల ఒక భరోసా అని వైఎస్ భారతి కామెంట్ చేశారు. ఈసారి కూడా జగన్ అధికారంలోకి రావడం ఖాయమన్న వైఎస్ భారతి చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ పేదల పక్షపాతిగా ఉండి పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్పారు. మొత్తం మీద పులివెందుల గడ్డ మీద ఆడబిడ్డతో వైఎస్ భారతి ఢీ అంటే ఢీ అంటున్నారు.