టెక్నికల్‌గా ఎలాన్ మస్క్ చెప్పింది కరెక్ట్: ఈవీఎంల హ్యాకింగ్‌పై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి


సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డయిన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తోన్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తోన్నారు. సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయపోరాటానికీ సిద్ధపడుతున్నారు.


ఈ పరిణామాల మధ్య టెక్ జెయింట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ట్వీట్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈవీఎంల హ్యాకింగ్ అనేది అమెరికా వంటి దేశాల్లో సాధ్యపడొచ్చని అన్నారు. ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసిన ఓటింగ్ మెషీన్‌లను రూపొందిస్తారని గుర్తు చేశారు. వాటి తయారీలో సాధారణ కంప్యూట్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తారని చెప్పారు.

భారత్‌లో తయారైన ఈవీఎంలు అత్యంత సురక్షితమైనవని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏదైనా నెట్‌వర్క్ లేదా మీడియంతో ఎలాంటి కనెక్టివిటీ ఉండదని చెప్పారు. బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్.. వంటిపై ఆధారపడి అవి పని చేయవని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ఎలాంటి అవకాశం లేని విధంగా వాటిని రూపొందించారని అన్నారు. అలాంటి ఈవీఎంలను కూడా ఎలా హ్యాక్ చేయగలరనే విషయంపై ఎలాన్ మస్క్ ట్యూషన్ చెబితే బాగుంటుందని రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. దీనికి మళ్లీ ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు. ఎలాంటి వాటినైనా హ్యాక్ చేయవచ్చని తేల్చి చెప్పారు. దీనిపై కేంద్ర మాజీమంత్రి మళ్లీ ఘాటుగా బదులుపెట్టారు.

సాంకేతికంగా అది నిజమేనని, క్వాంటమ్ కంప్యూట్‌ను తాను ఏ స్థాయిలోనైనా ఎన్‌క్రిప్షన్‌, డీక్రిప్షన్ చేయగలనని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ల్యాబ్ స్థాయి సాంకేతికత, అందుబాటులో ఉన్న వనరులతో జెట్, ఫ్లైట్ డిజిటల్ హార్డ్‌వేర్/సిస్టమ్‌ను హ్యాక్ చేయగలనని చెప్పారు. ఈవీఎంల విషయంలో మాత్రం అది అసాధ్యమని చెప్పారు.