జ‌న‌సేన‌లోకి బాలినేని.. రేపే ముహూర్తం?


ANDRA PRADESH, NELURU: ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో జ‌న‌సేన‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వం అవ‌స‌రం ఉంది. వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి తాజాగా రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి జ‌న‌సేన పార్టీలోకి వెళ్లేందుకు మార్గం సుగ‌మం అయిన‌ట్టు తెలిసింది. గత వారం ఆయ‌న జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబుతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ చ‌ర్చ‌లు ఫ‌లించిన త‌ర్వాతే ఆయ‌న తాజాగా త‌న రాజీనామాను వైసీపీకి స‌మ‌ర్పించిన‌ట్టు ఒంగోలు వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో జ‌న‌సేనలోకి బాలినేని చేరడం ఖాయ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో జ‌న‌సేన‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వం అవ‌స‌రం ఉంది. 


గ‌తంలో జ‌న‌సేనలో ఉన్న ఆమంచి స్వాములు(శ్రీనివాస‌రావు) ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌కు చీరాల నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇవ్వ క‌పోవ‌డంతో అలిగి పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో జ‌నసేన‌ను ముందుండి న‌డిపించే నాయ కుడి అవ‌స‌రం ఏర్ప‌డింది. దీనికితోడు.. ప్ర‌కాశంలో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవాల‌న్న ఉద్దేశం కూడా ప‌వ‌న్ కు ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద‌ని భావించిన బాలినేని ఈ స్టెప్ తీసుకున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇక‌, రాజ‌కీయంగా బాలినేనికి బ‌ల‌మైన వ్య‌క్తిగ‌త కేడ‌ర్ ఉంది. 

ప్ర‌కాశంలో 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ కోసం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించి.. బ‌ల‌మైన టీడీపీ కేడ‌ర్‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ ఇక్క‌డ‌వైసీపీ పాగా వేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంతేకాదు.. ఆమంచి స‌హా అనేక మంది నాయ‌కులు పార్టీలో అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ప్పుడు కూడా బాలినేని ముందుండి వారిని నడిపించారు. పార్టీపై ఈగ‌వాల‌కుండా చూసుకున్నా రు. అయితే.. వైసీపీ ఏర్ప‌డిన వైవీ సుబ్బారెడ్డి వ‌ర్సెస్ బాలినేని మ‌ధ్య వ‌ర్గ విభేదాలు చినుకు చినుకు గాలివాన‌గా మారిన చందంగా పెరిగిపోవ‌డం.. అధినేత వైవీ వైపే ఉండ‌డంతో బాలినేని మాన‌సికంగా రాజ‌కీయంగా కూడా ఇబ్బందులు ప‌డ్డారు. 

ఈ క్ర‌మంలో త‌న‌కు గౌర‌వమైన స్థానాన్ని ఇవ్వ‌ని వైసీపీలో ఉండ‌డం కంటే దూరంగా ఉంటేనే బెట‌ర్ అని ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న భావించారు. అయితే.. అప్ప‌ట్లో జ‌న‌సేన నుంచి ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు నాగ‌బాబు జోక్యం.. జ‌న‌సేన అవ‌స‌రం .. రెండూ క‌లిసి వ‌చ్చి, బాలినేనికి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, గురువారం బాలినేని మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ కానున్న‌ట్టు బాలినేని వ‌ర్గం చెబుతోంది. ఆ వెంట‌నే ఆయ‌న ఒక‌టి రెండు రోజుల్లోనే పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.